జార్ఖండ్: మద్యం మత్తులో ఉన్న తండ్రిని 12 ఏళ్ల కొడుకు పది రూపాయలు అడిగాడు. దీంతో ఆ తండ్రి తీవ్ర కోపోధ్రిక్తుడై కొడుకును విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జార్ఖండ్ ఛత్రా జిల్లాలోని వశిష్ట్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేలీబర్ గ్రామంలో బిలేశ్ భుయాన్ (48), భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ బిలేశ్ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యం సేవించే అలవాటుఉన్న బిలేశ్, అతని భార్య సోమవారం ఉదయం 9 గంటలకే పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ వాదులాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి కుమారుడు పప్పు కుమార్ తండ్రి వద్దకు వచ్చి.. ‘నానా.. ఓ పది రూపాయలు ఇవ్వవా’ అంటూ కోరాడు. ఐతే అప్పటికే తీవ్ర కోపంతో ఊగిపోతున్న భుయాన్ మరింత ఆగ్రహంతో కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
అదే సమయానికి ఇటుక బట్టీలో పనిచేసే కూతురు ఇంటికి వచ్చింది. తమ్ముడి మరణం చూసి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చిచూడగా బాలుడు పప్పు విగతజీవిగా పడివున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తండ్రిని అరెస్ట్ చేశారు. పప్పు తన తండ్రిని రూ.10 ఎందుకు అడిగాడు అనే విషయం తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.