AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand Election Results 2024: జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్‌కే పట్టం..! అనుకూలించిన ఆ కీలక అంశాలు

Jharkhand election results 2024 Updates: గత 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ప్రతి ఐదేళ్లకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చుతున్నారు ఓటర్లు. ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. అయితే ఈ సారి వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరెన్ దూసుకుపోతున్నారు.

Jharkhand Election Results 2024: జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్‌కే పట్టం..! అనుకూలించిన ఆ కీలక అంశాలు
Jharkhand CM Hemant Soren
Janardhan Veluru
|

Updated on: Nov 23, 2024 | 11:35 AM

Share

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024: జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్(జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు. దీంతో ఎలాగైనా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 50 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 గా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  లేటెస్ట్ ట్రెండ్స్ మేరకు జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది. జార్ఖండ్‌లో శనివారం (23 నవంబర్, 2024) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

గత 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేశారు. ప్రతి ఐదేళ్లకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చుతున్నారు ఓటర్లు. ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. అయితే ఈ సారి వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరెన్ దూసుకుపోతున్నారు. హేమంత్ సోరెన్ బర్హైత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై 2,812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అక్కడ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అంచనావేసింది. ఇండియా కూటమికి 53 సీట్లు, ఎన్డీయేకి 25 సీట్లు దక్కే అవకాశముందని తెలిపింది.

జేఎంఎం కూటమికి అనుకూలించిన అంశాలు..

జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయానికి రెండు అంశాలు కలిసొచ్చాయి. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఈ రెండు కూడా ఎన్నికల్లో బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2వేల 500 సాయంతో పాటు.. హేమంత్‌ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది. దీంతో.. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 51 సీట్ల మెజార్టీ ఇచ్చారు జార్ఖండ్ ప్రజలు.