Jayalalitha: ఆత్మవిశ్వాసం, అహంభావం, పట్టుదల, మొండితనం, ధీరత్వం, దృఢత్వం కలిగిన వ్యక్తిత్వం జయలలిత సొంతం!

కొంతమందే కారణజన్ములవుతారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఓ రకమైన శూన్యత ఆవరిస్తుంది.. ఆ శూన్యతను భర్తీ చేయడం దాదాపుగా అసాధ్యమవుతుంది.. పురచ్చి తలైవి జయలలిత అలాంటి వారే!

  • Balu
  • Publish Date - 1:01 pm, Wed, 24 February 21
Jayalalitha: ఆత్మవిశ్వాసం, అహంభావం, పట్టుదల, మొండితనం, ధీరత్వం, దృఢత్వం కలిగిన వ్యక్తిత్వం జయలలిత సొంతం!

కొంతమందే కారణజన్ములవుతారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఓ రకమైన శూన్యత ఆవరిస్తుంది.. ఆ శూన్యతను భర్తీ చేయడం దాదాపుగా అసాధ్యమవుతుంది.. పురచ్చి తలైవి జయలలిత అలాంటి వారే! ఆమెకు ప్రత్యామ్నాయం లేదు.. సమీప భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకమూ లేదు.. అలాగని ఆమేమీ గొప్ప నాయకురాలు కాదు.. నిండైన వ్యక్తిత్వమూ ఆమెలో లేదు. అందరిలాగే ఆమెలో మంచీ చెడూ రెండూ వున్నాయి.. మొక్కవోని ఆత్మవిశ్వాసం, అపారమైన మేథోసంపత్తి ఆమె సొంతం.. బహు భాషల్లో ఆమె ప్రావీణ్యురాలు. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే నేర్పు, పట్టుదల, కార్యదీక్షత, పరిపాలనా దక్షత ఆమెలో ఉన్నాయి.. అదే సమయంలో మొండి వైఖరి, అహంభావం అనే విశేషణాలతో పాటు అవినీతి, ఆశ్రిత పక్షపాతం అనే దుర్గుణాలు కూడా ఉన్నాయి.. అయినా జయలలితకు సాటి మరెవ్వరూ రారు.. ఆమె ఓ బలీయమైన శక్తి.. ఆ శక్తి ప్రతికూల పరిస్థితుల నుంచి వచ్చిందామెకు! అందుకే ఆమెను పురచ్చి తలైవి అన్నారేమో! శత్రువులను సహించలేని తత్త్వంతో పాటుగా దయార్ద్ర హృదయమూ ఉంది.. అందుకే అందరికీ అమ్మ అయ్యింది.. ఆమె మరణించే వరకు ఏదో ఓ అసంతృప్తి ఆమె మొహంలో కనిపించేది.. ఆమె జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. బాల్యం నుంచీ కష్టాలే! పుడుతూనే నోట్లో బంగారుచెంచాతో పుట్టలేదు. కడు పేదరికం అని అనలేము కానీ డబ్బుకు మాత్రం ఇబ్బంది ఉండేది.. జయలలిత చిన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సంధ్యపైనే భారమంతా పడింది.. అప్పటికే ఆమె సినిమాల్లో వేషాలు వేసేవారు కానీ హీరోయిన్‌ పాత్రలు కాదు.. మామూలు వేషాలు.. అందుకే పారితోషికం పెద్దగా ఉండేది కాదు.. ఈ కారణంగానే జయలలితను కూడా సినిమా రంగంలోకి దింపారు సంధ్య.. నిజానికి సినిమాలంటే జయలలితకు పరమ అసహ్యం.. తాను బాగా చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది.. చదువకుంటానని ఎంతగా బతిమాలినా బలవంతంగా తల్లి సినిమాల్లో ప్రవేశపెట్టడంతో ఓ రకమైన మొండితనం అప్పుడే అలవాటయ్యింది. సినిమా పట్ల ఆమెకు ఎలాంటి వ్యామోహం ఉండేది కాదు.. కేవలం దాన్నో వృత్తిగానే భావించేవారు.. డబ్బు సంపాదన కోసమే సినిమాల్లో నటించారు తప్ప సినిమాలపై అనురక్తితో కాదు. దర్శకులు షాట్‌ రెడీ అన్న తర్వాతే కెమెరా ముందుకు వచ్చి నటించి, బ్రేక్‌ రాగానే ఒంటరిగా ఏదో ఒక పుస్తకం చదువుకునేవారు. పక్కవారితో కాలక్షేపం కబర్లు చెప్పేవారు కాదు! సినిమావాళ్లతో ఎవరితోనూ పెద్దగా అటాచ్‌మెంట్‌ పెట్టుకోలేదు. ఎవరితోనూ గొడవలూ పెట్టుకోలేదు..Jayalalitha :IRON Lady of Indian Politics, Very restricted and stubborn lady has a mesmerizing voice   jayalalitha,IRON Lady of Indian Politics,thamilnadu,tamilnadu politics,IRON Lady of Indian Politics jayalalitha,నటన పట్ల పెద్దగా అభిరుచి లేకపోయినా ఇచ్చిన పాత్రలన్నింటినీ శ్రద్ధతో చేశారామె! ఏ పాత్రనైనా అవలీలగా నటించారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల సరసన నటించారు. సాంఘిక చిత్రాలకే పరిమితం కాలేదు.. జయలలిత జానపదాల్లో నటించారు. పౌరాణికి చిత్రాల్లో నటించారు.. అభినయించిన అన్ని పాత్రల్లోనూ చాలా అందంగా కనిపించారామె! కాకపోతే ఎంత త్వరగా సినీరంగంలో అడుగుపెట్టారో అంతే తొందరగా ఆ రంగం నుంచి తప్పుకున్నారు. మూడు పదుల వయసులోనే ఆమె సినీ కెరీర్‌ ముగిసింది.. తెలుగులో నాయకుడు వినాయకుడు ఆమె నటించిన చివరి చిత్రం.. ఆ తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు. 16 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి వచ్చారు.. రావడంతోనే ఆమె ఎమ్జీఆర్‌ దృష్టిలో పడ్డారు.. అప్పటి వరకు బి.సరోజాదేవితో వరుసగా పదేళ్లపాటు నటించిన ఎమ్జీఆర్‌కు జయలలిత తెగ నచ్చేశారు.. వెంటనే తనకంటే 31 ఏళ్ల చిన్నదైన జయలలితను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆయురత్తిల్‌ ఒరువన్‌ అనే ఆ సినిమా 1965లో విడుదలయ్యింది.. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ఈ జోడి కాస్తా హిట్‌పెయిర్‌గా మారింది.. అది మొదలు ఎమ్జీఆర్‌, జయలలిత హీరోహీరోయిన్లుగా 27 సినిమాలు వచ్చాయి.. ఆయురత్తిల్‌ ఒరువన్‌తోనే జయలలితకు స్టార్‌డమ్‌ వచ్చేసింది. తెలుగులో నాగేశ్వరరావుతో మనుషులు-మమతలు సినిమాలో నటించారు.. ఇదే ఆమెకు తెలుగులో తొలి చిత్రం.. 1973లో వచ్చిన డాక్టర్‌ బాబు సినిమాతో శోభన్‌బాబుకు దగ్గరయ్యారు జయలలిత. అయితే ఎమ్జీఆర్‌ కారణంగా శోభన్‌బాబు ఎక్కువ చనువు తీసుకోలేకపోయారు.. ఇదే సమయంలో జయలలిత తల్లి సంధ్య మరణించారు.. అప్పుడు జయలలితలో ఒంటరితనం ఆవరించింది.. మానసిక ఒత్తిళ్లు ఆమెను వెంటాడాయి.. సమాజం పట్ల కసి పెరిగింది.. సినిమాల్లో అవకాశాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి.Jayalalitha :IRON Lady of Indian Politics, Very restricted and stubborn lady has a mesmerizing voice   jayalalitha,IRON Lady of Indian Politics,thamilnadu,tamilnadu politics,IRON Lady of Indian Politics jayalalitha,ఆ దశలోనే ఎమ్జీఆర్‌ అండదండలతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయలలితకు అందులో పాతుకుపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.. ఏడాది తిరగకుండానే ఆమె ప్రాపగాండా సెక్రటరీ అయ్యారు.. ఆమె అందం, మాట తీరు ప్రజలకు విపరీతంగా ఆకర్షించాయి. మంచి వాక్చాతుర్యం ఉన్న జయలలితకు రాజకీయాలు నెరపడం పెద్ద కష్టమైన పనేమీ కాలేదు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఆమెలో ప్రతిభాపాటవాలు ఏపాటివో అందరికీ తెలిసొచ్చాయి.. ప్రజలు ఆమెను ఆరాధించడం మొదలు పెట్టారు.. సీనియర్లు ఎంతగా కినుక వహించినా ఎమ్జీఆర్‌ ఖాతరు చేయకుండా 1984లో జయలలితకు రాజ్యసభలో ప్రవేశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని జయలలిత చక్కగా ఉపయోగించుకున్నారు. రాజ్యసభలో ఆమె చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఆ టైమ్‌లోనే ఎమ్జీఆర్‌కు మూత్రపిండాల వ్యాధి వచ్చింది.. చికత్స కోసం అమెరికా వెళ్లారాయన! అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఎమ్జీఆర్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వీలు లేకుండా పోయింది. అమెరికాలోని హాస్పిటల్‌ నుంచి ఎమ్జీఆర్‌ మాట్లాడిన మాటలను వీడియోకెక్కించి ఊళ్లలో ప్రదర్శించారు. జయలలిత కూడా అహోరాత్రాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. ఎమ్జీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎమ్జీఆర్‌- జయలలిత మధ్య అపోహలు ఏర్పడటం, అవి దూదిపింజల్లా తొలగిపోవడం జరిగాయి.. 1987 డిసెంబర్‌లో ఎమ్జీఆర్‌ కన్నుమూశారు. మరణవార్త తెలియగానే జయలలిత అక్కడకు వెళ్లి ఎమ్జీఆర్‌ భౌతికదేహం దగ్గర నిల్చున్నారు.. అలా ఎమ్జీఆర్‌కు తానే అసలైన వారసురాలనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగేలా చేసుకున్నారు జయలలిత. ఇది ఆమె ప్రత్యర్థులకు తెలిసిపోయిందో ఏమో కానీ అంత్యక్రియలప్పుడు ఎమ్జీఆర్‌ శవం ఉన్న వాహనం నుంచి జయలలితను బలవంతంగా దింపేశారు. ఇది ఒక రకంగా జయలలితకు అనుకూలమే అయ్యింది. ప్రజల సానుభూతి లభించింది. ఇదే సమయంలో రెండాకుల పార్టీ కాస్తా రెండుముక్కలయ్యింది. జానకీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.. అయితే ఆమె పట్టుమని నెల రోజులు కూడా ఆ పదవిలో ఉండలేదు. ఈ సమయంలోనే ఎన్నికలు వచ్చాయి. జయలలిత, జానకిలిద్దరూ చెరో వైపు నుంచి పోటీకి దిగడంతో డీఎంకే విజయం సులువయ్యింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జానకీ రామచంద్రన్‌ రాజకీయాలు తన వల్ల కాదని పార్టీ బాధ్యతలను జయలలితకు కట్టబెట్టారు. ప్రతిపక్ష నేతగా జయలలిత అసెంబ్లీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కరుణానిధి బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న సమయంలో జయలలిత లేచి ఓ ప్రశ్న అడిగారు. దానికి కరుణానిధి తిన్నగా జవాబివ్వకుండా వెళ్లి శోభన్‌బాబును అడుగు అంటూ ఓ వెకిలి కామెంట్‌ చేశారు.. దాంతో జయలలిత తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కరుణానిధిని కొట్టండంటూ తన పార్టీ సభ్యులకు పిలుపిచ్చారు. వెంటనే అన్నాడీఎంకే సభ్యులు కరుణానిధిపైకి దూసుకుపోయారు.. పెద్ద యుద్ధమే జరిగిందప్పుడు. ఆ సమయంలోనే పీడబ్ల్యూడీ మంత్రి అయిన దురై మురుగన్‌ జయలలిత చీర కొంగు లాగారు. అంతే ఆమెలో కోపం తన్నుకొచ్చేసింది. ఆ అవమానభారాన్ని భరించలేక సభ నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టేసి దుశ్శాసనులు ఉన్న ఈ సభలో మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు.. అలా పంతం పట్టిన ఆమె రెండేళ్ల తర్వాత ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ జయలలితలో కరుకుదనాన్ని నింపాయి. ప్రత్యర్థులను అగణదొక్కాలనే కసి పెరిగింది ఆమెలో! ఎంతగా అంటే కరుణానిధిని అర్థరాత్రి అరెస్ట్‌ చేయించి జైల్లో పెట్టించేంతగా!Jayalalitha :IRON Lady of Indian Politics, Very restricted and stubborn lady has a mesmerizing voice   jayalalitha,IRON Lady of Indian Politics,thamilnadu,tamilnadu politics,IRON Lady of Indian Politics jayalalitha, జయలలితను నియంత అని తిట్టిపోసేవారు కూడా ఆమె అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందన్న ఆలోచన చేయకుండా ఉండరు.. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కుక్కలు చింపిన విస్తరి అవుతుందనుకున్నారు కానీ నాలుగేళ్లపాటు ప్రభుత్వం సజావుగానే సాగింది.. రాబోయే ఎన్నికల్లో గెలుస్తున్న గ్యారంటీ లేదు. ఎందుకంటే జయలలిత వారుసులెవరన్నదానిపై తమిళ ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. పళనిస్వామినా? పన్నీర్‌ సెల్వమా? శశికళనా? ఎవరిని నమ్మాలి? ఎవరి పక్షాన నిలబడాలి అన్నది తేల్చుకోవడం కష్టమే! ఒక్కటి మాత్రం నిజం! జయలలితలాంటి విశిష్ట వ్యక్తులు కొందరే ఉంటారు.. ఇప్పుడు జయలలిత లేని లోటు తమిళనాడులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పురచ్చి తలైవికి ఆల్టెర్‌నెట్‌ లేదు..Jayalalitha :IRON Lady of Indian Politics, Very restricted and stubborn lady has a mesmerizing voice   jayalalitha,IRON Lady of Indian Politics,thamilnadu,tamilnadu politics,IRON Lady of Indian Politics jayalalitha,