AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan: రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో.. జింబాబ్వే పై అఫ్గానిస్తాన్ ఘన విజయం

Rashid Khan: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్థాన్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రషీద్ ఖాన్ 10 బంతుల్లో 30 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. ఇజాజ్ అహ్మద్‌జాయ్ 22 బంతుల్లో 52 పరుగులు బాదాడు. 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ 177 పరుగులు చేయగా, జింబాబ్వే 140 పరుగులకే ఆలౌట్ అయింది.

Rashid Khan: రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో.. జింబాబ్వే పై అఫ్గానిస్తాన్ ఘన విజయం
Rashid Khan
Rakesh
|

Updated on: Oct 28, 2026 | 7:30 AM

Share

Rashid Khan: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాట్‌తో వేగంగా పరుగులు సాధించి జట్టును ఆదుకున్న అతడు, ఆ తర్వాత బంతితోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

66 పరుగులకే 5 వికెట్లు

షార్జాలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అఫ్గానిస్థాన్ ఆరంభంలోనే తడబడింది. కీలక బ్యాటర్లు త్వరగా వెనుదిరగడంతో ఒక దశలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో జింబాబ్వే అఫ్గాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసేలా కనిపించింది. అయితే షాహిదుల్లా కమల్ 42 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరోవైపు ఇజాజ్ అహ్మద్‌జాయ్, రషీద్ ఖాన్ వేగంగా పరుగులు సాధించి జట్టుకు అండగా నిలిచారు.

22 బంతుల్లో 52 పరుగులు

ఇజాజ్ అహ్మద్‌జాయ్ జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 52 పరుగులు బాదాడు. అతడికి తోడుగా రషీద్ ఖాన్ కేవలం 10 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. వీరిద్దరి దూకుడుతో అఫ్గానిస్థాన్ స్కోరు ఒక్కసారిగా పెరిగింది. చివరకు 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. జింబాబ్వే తరఫున న్యూమన్ న్యామహురి నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్రాడ్ ఎవాన్స్, ఎర్నెస్ట్ మసుకు రెండేసి వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ అఫ్గాన్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయలేకపోయారు.

140 పరుగులకే జింబాబ్వే ఆలౌట్

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆశించిన ఆరంభం లభించలేదు. కొందరు బ్యాటర్లు క్రీజులో నిలిచినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ర్యాన్ బర్ల్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇన్నోసెంట్ కైయా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ సికందర్ రజా, వెస్లీ మాధెవెరె చెరో 17 పరుగులు సాధించారు. అయితే అఫ్గాన్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో జింబాబ్వే 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.

ఫారూఖీ మూడు వికెట్లు

అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫారూఖీ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని వేగవంతం చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాహిదుల్లా కమల్‌కు ఒక వికెట్ దక్కింది. మొత్తంగా 37 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో 10 బంతుల్లో 30 పరుగులు, బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us