Jammu Kashmir Election: జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్ ప్రశాంతం.. సా. 5 గంటల వరకు 58.19% ఓటింగ్
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం ఓటింగ్ నమోదైంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటికీ చాలా పోలింగ్ బూత్‌ల వెలుపల ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న జరగనుంది. అత్యధిక ఓటింగ్ కిష్త్వార్ జిల్లాలో 77.23%, అత్యల్పంగా పుల్వామాలో 43.87% పోలింగ్ నమోదైంది. ఈరోజు 23.27 లక్షల మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉంది.
అనంతనాగ్ – 54.17 శాతం ఓటింగ్
దోడా – 69.33 శాతం ఓటింగ్
కిష్త్వార్ – 77.23 శాతం ఓటింగ్
కుల్గామ్ – 59.62 శాతం ఓటింగ్
పుల్వామా – 43.87 శాతం ఓటింగ్
రాంబన్ – 67.71 శాతం ఓటింగ్
షోపియాన్ – 53.64 శాతం ఓటింగ్
జమ్మూకశ్మీర్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. బూత్‌ల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఇందులో పురుషులు, మహిళలు, యువకులు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో ఇది మొదటి ఎన్నికలు. గత అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. పీడీపీ అభ్యర్థి, పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ బిజ్‌బిహారా అసెంబ్లీ స్థానం నుంచి ఓటు వేశారు. కిష్త్వార్ బీజేపీ అభ్యర్థి షగున్ పరిహార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి దశ ఓటింగ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న 35 వేల మందికి పైగా కశ్మీరీ పండిట్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి కోసం మొత్తం 24 ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో 4, జమ్మూలో 19, ఉదంపూర్‌లో 1 బూత్‌లు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ 24 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 24 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశలో దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని 16 స్థానాలకు, జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మరోసారి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన 19 సెప్టెంబర్ 2024న శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు దోడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో, దక్షిణ కాశ్మీర్‌లో 22 స్థానాలకు ఓటింగ్ జరిగింది. అప్పుడు మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ 11 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 4 సీట్లు గెలుచుకున్నాయి. ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు 2 సీట్లు, సీపీఐ (ఎం)కి ఒక సీటు లభించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..