International Tigers Day: నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. పులుల మనుగడతోనే జీవ వైవిధ్యం..

ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో పెద్దపులి చేరింది. రెడ్‌ డాటా బుక్‌లో పెద్దపులి పేరు నమోదైంది. ఇది ఆందోళన కలిగించే అంశమే అయినా ప్రస్తుతం పెద్దపులుల సంఖ్య ఏటా పెరుగుతుండటం కొంత సంతోషం కలిగించేదిగా ఉంది. పెద్ద పులులకు అత్యంత సురక్షితమైన అభయారణ్యం నల్లమల.

International Tigers Day: నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. పులుల మనుగడతోనే జీవ వైవిధ్యం..
Tigers
Follow us
Fairoz Baig

| Edited By: Aravind B

Updated on: Jul 29, 2023 | 1:48 PM

ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో పెద్దపులి చేరింది. రెడ్‌ డాటా బుక్‌లో పెద్దపులి పేరు నమోదైంది. ఇది ఆందోళన కలిగించే అంశమే అయినా ప్రస్తుతం పెద్దపులుల సంఖ్య ఏటా పెరుగుతుండటం కొంత సంతోషం కలిగించేదిగా ఉంది. పెద్ద పులులకు అత్యంత సురక్షితమైన అభయారణ్యం నల్లమల. నల్లమలలోని నాగార్జున సాగర్‌ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం, అలాగే గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాలు పెద్దపులులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి అనువైన ప్రదేశాలుగా దేశంలోనే గుర్తింపు పొందాయి. ఈ నల్లమలతో పాటు పాపికొండల్లో తాజాగా రెండు పెద్దపులులు ఉన్నట్టు సమాచారం అందడంతో వాటి సంఖ్య ప్రస్తుతం 75కు చేరింది. తాజాగా 2022లో జరిగిన పులుల గణనలో ఈ సంఖ్య వెలుగులోకి వచ్చింది. 2018లో చేపట్టిన గణనలో 47 మాత్రమే ఉండగా ప్రస్తుతం అవి 75కి చేరాయి. దీంతో రికార్డు స్థాయిలో నాలుగేళ్ళ కాలంలో 60 శాతం పులుల జాతి అభివృద్ది చెందిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

పెద్దపులులకు దేశంలోనే పుట్టిల్లు నల్లమల అభయారణ్యం

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అటవీ ప్రాంతం కలిగి వైవిద్యమైన జంతుజాలం, అరుదైన వృక్షాలకు ఆలవాలంగా ఉన్న నల్లమల అడవులు మూడు దశాబ్దాలుగా అలజడికి గురయ్యాయి. ఇరవై ఏళ్ళపాటు నల్లమలలో నక్సలైట్లు, మావోయిస్టులు రాజ్యమేలారు. శత్రు దుర్భేద్యంగా నల్లమల అడవుల్ని మార్చుకుని తమ కార్యకలాపాలను సాగించారు. వీరి జాడల్ని కనుక్కునేందుకు పోలీసులు కూడా ఇరవై ఏళ్ళు నల్లమలను జల్లెడు పట్టి పలుమార్లు హోరాహోరీ పోరాడారు. ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌, కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావుతో సహా ముఫ్ఫయి మంది మావోయిస్టుల దాకా ఈ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. దీంతో నల్లమల ప్రాంతాన్ని మావోయిస్టులు విడిచిపెట్టి ఏవోబిలోకి వెళ్ళిపోయారు. ఇంతకాలం మావోయిస్టులు నల్లమలను స్థావరంగా చేసుకుని తమ కార్యకలాపాలు సాగించడం, వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో అటవీసంపదకు, జంతుజాలాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. ముప్ఫయి ఏళ్ళుగా నల్లమలలో వేటగాళ్ళు అడుగు పెట్టాలంటే భయపడి చచ్చేవాళ్ళు. ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసులు. వేటగాళ్ళకు సింహస్వప్నంగా నిలిచారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులు లేకపోవడంతో పోలీసులకు కూడా నల్లమలలో పనిలేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

ఇదే అంశం ఇప్పుడు వేటగాళ్ళకు పని కల్పించింది. నల్లమలలో అరుదైన వన్య మృగం పెద్దపులిని పట్టుకునేందుకు హర్యానా నుంచి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న వేటగాళ్లు వచ్చేవారు. గత ఐదేళ్ళుగా నల్లమలలో మావోయిస్టులు లేకపోవడంతో స్మగ్లర్లు మళ్ళీ విజృంభించారు… ఒకవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, మరోవైపు జంతువుల వేటగాళ్ళు. నల్లమలను సర్వనాశనం చేస్తున్నారు. వీరితో తలపడేందుకు అవసరమైన సిబ్బంది, ఆయుధాలు లేక అటవీశాఖ అధికారులు నానా ఇబ్బందులు పడేవారు. హర్యానా వేటగాళ్లకు పులి కనిపిస్తే చాలు రాక్షసులుగా మారిపోతారు… వెంటనే పులిని పట్టుకుని చంపి, తమ వెంట తీసుకెళతారు. అయితే వీరిని నిరోధించేందుకు అటవీశాఖ అధికారులు స్తానిక చెంచుల సహకారం తీసుకుని రాత్రీ, పగలు గస్తీ కాయడంతో ఇటీవల కాలంలో వేటగాళ్ళ ఆటలు సాగలేదు. దీంతో జింకలు, దుప్పులతో పాటు పెద్ద పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

రికార్డు స్థాయిలో పులుల పెరుగుదల

దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు తాజాగా చేపట్టిన పులుల గణనలో తేలింది. 2020లో వీటి సంఖ్య 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు తాజాగా అటవీ అధికారులు గుర్తించారు. నల్లమలలోని 73 పులులకు అదనంగా చేరిన మరో రెండు పులులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం పెరగడం గొప్ప విషయమని అటవీ అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం పెరిగింది.

పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

నాలుగేళ్లలో పులుల సంఖ్య 47 నుంచి 75 వరకు పెరగటానికి నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఎక్కడికక్కడ గడ్డిని పెంచటంతో పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. అటవీ సమీప గ్రామాలు, కొన్ని చెంచుగూడేలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో 73 పులులతో పాటు 300 చిరుతలు, 300 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

పెరిగిన పులులతో పశువులకు ప్రాణ సంకటం

ప్రకాశంజిల్లా అర్ధవీడు అటవీప్రాంతంలో ఆరునెలలుగా ఓ పెద్దపులి హడలెత్తిస్తోంది. నాగార్జునసాగర్‌ – శ్రీశైలం అభయారణ్యం ప్రాంతంలోకి వచ్చే ఆవులను చంపి తింటోంది. అభయారణ్యంలోకి వచ్చే అవులను కాకుండా చుట్టుపక్క గ్రామాల పరిసరాల్లోకి వచ్చి ఆవులను చంపేస్తోంది. నాలుగు గ్రామాల్లో సంచిరిస్తున్న పెద్దపులి 2023 జూన్‌లో పదిరోజుల వ్యవధిలో రెండు ఆవులను చంపేసింది. మరో ఆవును తీవ్రంగా గాయపర్చింది.. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు… పెద్దపులి సంచారం గురించి తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో పరిశీలించి పాదముద్రలు సేకరించారు. పాదముద్రలు పెద్దపులివిగా నిర్దారించారు… అడవిలో మేతకోసం పశువులను తోలవద్దని గ్రామస్థులను కోరారు. అలాగే అడవిలోకి ఒంటరిగా ఎవరూ వెళ్ళవద్దని సూచిస్తున్నారు… ఆహారం కోసం పెద్దపులి గ్రామాల సమీపంలోకి వస్తుందని, ఆహారం దొరికి వెంటనే తిరిగి తన నివాస ప్రాంతానికి వెళ్ళిపోతుందని అంతవరకు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామాల వైపుకు పెద్దపులులు రావడం లేదని ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. వేసవి కాలంలో తాగునీటికోసం గ్రామాల్లోకి వచ్చాయని, ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున అడవుల్లోనే ఉన్నాయని చెబుతున్నారు.

పులుల కలయికకాలంలో అడవిలో సంచారం నిషేధం

తాజాగా నల్లమల అడవిలో యాత్రికులను నిలిపివేస్తూ జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. జులై 1వ తేది నుంచి సెప్టెంబరు 30 వతేది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి. నల్లమల అటవీ ప్రదేశాలలోని పర్యాటక ప్రదేశాలన్నింటిలో ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. పులులు, వన్య ప్రాణుల కలయికతో అవి గర్భందాల్చే కాలంగా పరిగణిస్తూ నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయరణ్యలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటిలో మానవ సంచారాన్ని మూడు నెలలపాటు నిషేదించారు. దీంతో నల్లమలలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం, నెక్కంటి జంగిల్ రైడ్ నిలిపివేశారు…నిబంధనలు అతిక్రమించి అడవిలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972, ఆంధ్రప్రదేశ్ అటవీచట్టం-1967, జీవ వైవిధ్య చట్టం -2002 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.