Calcutta HC: జైళ్లో మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్‌.. జైలులోనే పుట్టిన 196 మంది పిల్లలు

|

Feb 09, 2024 | 4:54 PM

పశ్చిమ బెంగాల్‌లోని కారాగారాలు, కరెక్షనల్‌ హోమ్స్‌లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన కలకత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు సీరియస్‌ అయ్యింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆందోళనకరమని..

Calcutta HC: జైళ్లో మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్‌.. జైలులోనే పుట్టిన 196 మంది పిల్లలు
Women Prisoners Getting Pregnant In West Bengal
Follow us on

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పశ్చిమ బెంగాల్‌లోని కారాగారాలు, కరెక్షనల్‌ హోమ్స్‌లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన కలకత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు సీరియస్‌ అయ్యింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆందోళనకరమని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఖారాగారాల్లో మహిళా ఖైదీలు ఏకంగా 196 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు హైకోర్టు ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ కోర్టుకు నివేదించింది.

ఈ వ్యవహారంపై అమికస్‌ క్యూరీని ఏర్పాటు చేసిన హైకోర్టు రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోరింది. దీనిపై తాజాగా అమికస్‌ క్యూరీ నివేదికను కోర్టుకు సమర్పించింది. మహిళా ఖైదీలు జైలులో ఉండగానే గర్భం దాల్చి, ప్రసవిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పలు జైళ్లలో 196 మంది పిల్లలు పుట్టారని నివేదించింది. ఈ సమస్య నివారణకు.. మహిళా ఖైదీలు ఉన్న ఎన్‌క్లోజర్‌లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధాన్ని ప్రతిపాదిస్తూ అమికస్ క్యూరీ నివారణ చర్యను సూచించింది. ప్రస్తుతం జైళ్లలో గర్భంతో ఉన్న మహిళా ఖైదీలు, తదుపరి జననాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సు చేసింది.

అమికస్ ఇచ్చిన మరో సూచన ఏమిటంటే.. దిద్దుబాటు గృహాలలో ఉన్న సమయంలో ఎంత మంది మహిళా ఖైదీలు గర్భం దాల్చారో తెలుసుకునేందుకు అన్ని జిల్లాల న్యాయమూర్తులు వారి అధికార పరిధిలోని కారాగారాలను సందర్శించి, స్వయంగా తెలుసుకోవాలి. అలాగే, వారిపై లైంగిక దోపిడీని అరికట్టేందుకు, మహిళా ఖైదీలందరినీ కారాగారాలకు పంపే ముందు వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జిల్లాల చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పోలీసు స్టేషన్ల ద్వారా ఈ గర్భ పరీక్షలను నిర్వహించాలి. ఈ మేరకు న్యాయస్థానం అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అమికస్ నివేదికలో పేర్కొంది. చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యతో కూడిన డివిజన్ బెంచ్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

విచారణ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఖైదులో ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సవాళ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మహిళా ఖైదీల హక్కులు, శ్రేయస్సును కాపాడేందుకు సమగ్ర సంస్కరణల రూపొందించాలని, ఈ క్లిష్ట సమస్యలను లోతుగా పరిశోధించి, ఖైదీలందరికీ న్యాయం, గౌరవం ఉండేలా సమర్థవంతమైన చర్యలను అన్వేషిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యతో కూడిన డివిజన్ బెంచ్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.