అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య! పిజ్జా డెలివరీ చేస్తుండగా..
అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఎంబీఏ విద్యార్థి కుంచ అన్షుల్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. టెంపుల్ యూనివర్సిటీలో చదువుతున్న అన్షుల్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో దారుణ హత్యకు గురయ్యాడు. టెంపుల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న అన్షుల్ తన విద్యా ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌గా పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మండలానికి చెందిన అన్షుల్ జూన్ 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ కోసం ఉత్తర ఫిలడెల్ఫియాలోని ఎడ్జ్లీ స్ట్రీట్‌లో ఉన్న రేమండ్ రోసెన్ హోమ్స్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఒక ఖాళీ ఇంటికి మూడు పిజ్జా బాక్సులను డెలివరీ చేసిన అనంతరం బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానిక వ్యక్తి షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనాస్థలిలో మూడు తూటాల ఖాళీ గుళ్లను స్వాధీనం చేసుకున్నారు. అన్షుల్ తల వెనుక భాగంలో తుపాకీ గాయాలు ఉండటంతో అతడిని అతి సమీపం నుంచి కాల్చినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో అన్షుల్‌ను ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గుర్తించారు. వారిలో ఒకరు బ్యాక్‌ప్యాక్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డెలివరీ కోసం ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
అన్షుల్ మరణవార్తతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గతంలో కూడా తన సోదరుడు దోపిడీకి గురయ్యాడని, ఈ ఘటన వెనుక పథకం ప్రకారమే దుండగులు వ్యవహరించి ఉండవచ్చని అన్షుల్ సోదరి అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అలాగే అన్షుల్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని ఆమె అమెరికాలోని భారత కాన్సులేట్‌ను కోరింది. ఈ ఘటన అమెరికాలో భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
