India-Sri Lanka: చైనాతో సఖ్యతగా ఉన్నా.. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మిత్ర దేశాన్ని ఆదుకునేందుకు..

India - Sri Lanka Relations: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మిత్ర దేశాలు ఆపన్నహస్తం అందించాలంటూ కోరుతోంది. ఈ తరుణంలో భారత్ స్పందించి శ్రీలంకకు సాయం చేసింది. భారత్ - శ్రీలంక మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ..

India-Sri Lanka: చైనాతో సఖ్యతగా ఉన్నా.. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మిత్ర దేశాన్ని ఆదుకునేందుకు..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2022 | 1:32 PM

India – Sri Lanka Relations: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మిత్ర దేశాలు ఆపన్నహస్తం అందించాలంటూ కోరుతోంది. ఈ తరుణంలో భారత్ స్పందించి శ్రీలంకకు సాయం చేసింది. భారత్ – శ్రీలంక మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ.. ద్వీప దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్ గురువారం 1 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఆహారం, మందులు, ఇతర అవసరమైన వస్తువుల దిగుమతి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదేశాలతో.. శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం జరిగింది.. అయితే.. భారత్ ఎల్లవేళలా శ్రీలంక ప్రజలకు అండగా నిలుస్తోంది. సంక్షోభ సమయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని.. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాలపై సంతకానికి ముందు రాజపక్సేను సీతారామన్, జైశంకర్ సంయుక్తంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. “ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, శ్రీలంక ప్రస్తుత ఆర్థిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య స్వల్ప, మధ్యస్థతోపాటు దీర్ఘకాలిక ఆర్థిక సహకారం లాంటి ఒప్పందాలకు ఇరు దేశాలు అంగీకరించాయి” అని హైకమిషన్ తెలిపింది. అంతకుముందు రోజు రాజపక్స విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్‌తో సమావేశమయ్యారు. విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఇరువురు చర్చించారు.

అయితే.. తక్కువ ఆదాయం, అధిక దిగుమతి బిల్లుల కారణంగా పర్యాటక ఆధారిత శ్రీలంక విదేశీ మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్ డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్ డాలర్ల లోటులో శ్రీలంక కోట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో భారత్ ఇప్పటికే 1.5 బిలియన్ డాలర్ల సాయంను అందిచడంతోపాటు మరియు 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్‌ సాయాన్ని ప్రకటించింది. ఇదేకాకుండా సెటిల్‌మెంట్ 515.2 మిలియన్ డాలర్లకు చేరినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. శ్రీలంకకు భారత్ చేస్తున్న సహాయం న్యూఢిల్లీ – కొలంబో మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అయితే.. హిందూ మహాసముద్ర తీర రాష్ట్రాలలో చైనా తన నౌకాదళాన్ని విస్తరించింది. ఈ క్రమంలో ట్రింకోమలీ చమురు క్షేత్రాన్ని ఆధునీకరించడానికి శ్రీలంకకు సహాయం చేయడం వల్ల హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును భారత్ వ్యూహాత్మకంగా అడ్డుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తీవ్ర ఆర్ధిక సంక్షోభం.. నిండుకున్న ఇంధన నిల్వలు..

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, చమురు, ఆహారం, ఔషధాల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన శ్రీలంక ప్రస్తుతం ఆర్ధిక సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. నగదు కొరతతో సమస్యలు మరింత తీవ్రతరం అయ్యాయని న్యూస్ 9 ప్రతినిధి బృందం జరిపిన అధ్యయనంలో తెలిసింది. జనవరి 19, 2022న, కొలంబోలోని కెలనిటిస్సా పవర్ స్టేషన్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్లు ఇంధన కొరత కారణంగా పూర్తిగా నిలిచిపోవడంతో శ్రీలంక సంక్షోభం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) అధికార ప్రతినిధి, పవర్ స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే దాని ఇంధన నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. రోజువారీ 1.6 మిలియన్ లీటర్ల ఇంధన చమురును వారం నుంచి ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అయితే.. చమురు ఉన్నప్పటికీ.. ద్వీప దేశం చెల్లించాల్సిన 30 మిలియన్ల డాలర్లను చెల్లించలేదు. దీంతోపాటు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది.

విధానపరమైన నిర్ణయాలతో..

అయితే, కోవిడ్-19 కారణంగా టూరిజం రంగం అతలాకుతలమైంది. మహమ్మారి సమయంలో ఆర్థిక కార్యకలాపాలపై అడ్డంకులు, విధానపరమైన నిర్ణయాల కారణంగా ద్వీపం దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. చమురుపై ఎక్కువగా ఆధారపడే ద్వీప దేశానికి పరిస్థితిని మరింత దిగజారింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఆహారం, ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి డబ్బు లేదు. పాలపొడి వంటి నిత్యావసర వస్తువులతో సహా అన్ని ధరలు తీవ్రంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కొరత, వంట గ్యాస్ కొరత, విద్యుత్ సంక్షోభం పెరిగింది. మార్చి 5 తర్వాత విద్యుత్ కోతలు ఉండవని రాష్ట్రపతి కార్యాలయం ఈ నెల ప్రారంభంలో ప్రకటించినప్పటికీ.. మార్చి 17 వరకు దేశవ్యాప్తంగా 5 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. శ్రీలంక మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 40 GWH. శ్రీలంక విద్యుత్ అవసరాలలో దాదాపు మూడింట ఒక వంతు చమురుతో నడిచే ప్లాంట్ల ద్వారా తీర్చబడుతుంది. మిగిలినవి బొగ్గు (45 శాతానికి పైగా) జలవిద్యుత్ నడిచే ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది.

స్వాతంత్ర్యం తరువాత..

1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అత్యంత ఘోరమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంచనాల ప్రకారం దేశం పవర్ ప్లాంట్లను నడపడానికి అవసరమైన డీజిల్ పెట్రోల్ కోసం ప్రతి నెలా $500 మిలియన్లు అవసరం. అయితే, దాని విదేశీ నిల్వలు జనవరి చివరి నాటికి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి $2.36 బిలియన్లకు చేరుకున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది ఎగుమతి ఆదాయాన్ని 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే, ఈ ఏడాది దిగుమతుల వ్యయంగా దేశం 22 బిలియన్ డాలర్లు భరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీని ప్రకారం 10 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతుంది. దేశం ఈ సంవత్సరం $6.9 బిలియన్ల రుణ వాయిదాలు, సావరిన్ బాండ్లను మెచ్యూర్ చేయనుంది. దీంతో $11.9 బిలియన్ల లోటు ఉంటుంది. వడ్డీ రేట్లు పెంచడం, అనవసర దిగుమతులపై నియంత్రణలు అలాగే స్థానిక కరెన్సీ విలువ తగ్గింపు (ఇప్పటి వరకు 15 శాతం) నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) నుండి సహాయం కోరాలని నిర్ణయించుకుంది.

చైనా మైత్రి కంటే.. భారత్ బంధమే బలమైనది..

అయితే.. ఇటీవల శ్రీలంక.. తన రెండు అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్య దేశాలైన భారత్.. చైనాను సాయం చేయాలంటూ కోరింది. అయితే.. ఈ సంవత్సరం జనవరి ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కొలంబోను సందర్శించినప్పుడు.. శ్రీలంక నాయకులు చైనా నుంచి భారీ సాయం అందుతుందని అంచనా వేశారు. కానీ.. చైనా నుంచి ఉపన్యాసాలు తప్పితే ఎలాంటి సాయం అందలేదు. అయితే వాంగ్ యి పర్యటన తర్వాత శ్రీలంక మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతోపాటు చైనా నుంచి సాయం ఆశించిన నాయకులు కూడా భంగపడ్డారు. అయితే.. శ్రీలంక పరిస్థితిని.. రాజపక్సే సోదరులు వినతిని ఆలకించిన భారత్ మాత్రం మిత్ర దేశానికి సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడి వారు కూడా హర్షం వ్యక్తంచేశారు. బహుశా ద్వైపాక్షిక బంధం కూడా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశం సేవలను శ్రీలంక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మహాసముద్రం ప్రస్తుతం చైనా వివాదాస్పద ప్రాంతంగా మారింది. అయితే.. చైనా మైత్రి కంటే.. భారత్ బంధమే బలమైనదని మరోసారి రుజువు చేసిందని వ్యాసకర్త కేవి రమేష్ పేర్కొన్నారు.

Also Read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

China Coronavirus: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. లాక్‌డౌన్‌లో 4 కోట్ల మంది ప్రజలు