India-Pak Ties: భారత్-పాక్ మధ్య సత్ససంబంధాలు నెలకొంటాయా? రెండు దేశాల మధ్య మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయా? దీనికి సంబంధించి అనధికారికంగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు నిదర్శనంగా తాజాగా పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న అనధికారిక చర్చలు సఫలమైతే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందంటూ పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వియాన్ మన్షా అన్నారు. ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నిజంగానే భారత్-పాక్ మధ్య అనధికారిక చర్చలు జరుగుతున్నాయా? ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి జరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇటీవల పాకిస్తాన్ రాజధాని లాహోర్‌లో జరిగిన లాహోర్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో నిషాత్ గ్రూప్ ఛైర్మన్ వియాన్ మన్షా..‘‘ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక నెలలోపు పాకిస్తాన్‌ను సందర్శించవచ్చు.’’ అని చెప్పారు. ఇదే విషయాన్ని పాక్ మీడియా సంస్థ ‘ది డాన్’ ప్రధాన శీర్షికగా పేర్కొంది. అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి విభిన్నంగా స్పందించింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బిలియనీర్ అయిన మన్షా.. నిషాత్ గ్రూప్ వ్యవస్థాపకుడు, CEO. ఈ సంస్థ.. విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, ఇతర రంగాలలో ఉంది. పాకిస్తాన్‌లో ఇది అతిపెద్ద పారిశ్రామిక సంస్థ. లాహోర్ వేదికగా జరిగిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ప్రసంగించిన మన్షా.. ‘‘పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకపోతే.. దేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఆర్థిక అభివృద్ధికి ప్రాంతీయ విధానాన్ని అనుసరించాలి. యూరప్ రెండు గొప్ప యుద్ధాలు చేసింది. కానీ చివరికి శాంతి, ప్రాంతీయ అభివృద్ధి కోసం రాజీపడింది. కావాల్సింది శాశ్వత శత్రుత్వం కాదు, అభివృద్ధి కావాలి.” అని మన్షా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇరు దేశాలు తమ వివాదాలను పరిష్కరించుకోవాలని, ఈ ప్రాంతంలో పేదరికంపై పోరాడేందుకు వాణిజ్యాన్ని ప్రారంభించాలని మన్షా సలహా ఇచ్చారని ది డాన్ పేర్కొంది.
ఇదిలాఉంటే.. భారత్-పాక్ సంబంధాలపై పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ కీలక కామెంట్స్ చేశారు. రెండు దేశాల మధ్య చర్చలకు మంచి వాతావరణాన్ని సృష్టించే బాధ్యతను భారతదేశంపై నెట్టారు. ‘‘మేము ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. కానీ చర్చలు జరిగే మంచి వాతావరణం భారతదేశం నుండి రావాలి’’ అని యూసుఫ్ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ‘‘ప్రబలమైన భావజాలం’’ చర్చలకు ఉన్న అన్ని మార్గాలను మూసివేసిందని వ్యాఖ్యానించారు.
నిజంగానే చర్చలు జరుగుతున్నాయా?
పాకిస్తాన్ పారిశ్రామిక వేత్త మన్షా చేసిన కామెంట్స్ ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మధ్య సత్ససంబంధాలు నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతున్నాయా అనేది ఆసక్తిగా మారింది. భారత్-పాక్ మధ్య 75 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఏనాడూ రెండు దేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొన్న దాఖలాలు లేవు. అయితే, ఈ దఫా చర్చల అంశంపై పారిశ్రామిక వేత్త చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే, ఈ చర్చల గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. 1947 లో రెండు దేశాలు స్వతంత్ర దేశాలుగా మారినప్పటి నుండి, రెండు దేశాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి ఎన్నోమార్లు సంప్రదింపులు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. చర్చల సందర్భంగా ఒప్పందాలు చేసుకోవడం.. ఆ తరువాత వాటిని విస్మరించడం తరచుగా జరుగుతూనే ఉంది. ఇక భారతదేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఎన్నో ఘర్షణలు చోటు చేసుకున్నాయి కూడా. పాక్, చైనా సంబంధాలు, ఉగ్రవాదుల వ్యవహారం, పుల్వామా ఘటన, బాలాకోట్ దాడులు వంటి ఎన్నో సంఘటనలు భారత్-పాక్ మధ్య సంబంధాలకు పూర్తిగా ఇలాంటి తరుణంలో ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే పరిస్థితులను గమనించాల్సిందే.
Also read:
FLIPKART TV SALE: భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ సేల్.. ఆఫర్ల వర్షం..
AP: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ట్యాంకర్‌ను ఆపి చెక్ చేస్తే అవాక్కు