Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్
Fastest in world: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ల సంఖ్య 32 కోట్లు దాటింది.
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ల సంఖ్య 32 కోట్లు దాటింది. ఆదివారం దేశంలో 17, 21 268 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 మందికి టీకాలు ఇచ్చినట్లయ్యింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక వేగంగా వ్యాక్సినేషన్ చేసిన దేశంగా భారత్ అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్‌లలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని వెల్లడైంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… భారత్‌లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభం కాగా, బ్రిటన్‌లో గత ఏడాది డిసెంబర్ 8 న, యూఎస్‌లో డిసెంబర్ 14 న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో డిసెంబర్ 27 న మొదలయ్యింది. జూన్ 28న ఉదయం 8 గంటల సమయానికి బ్రిటన్‌లో 7 కోట్ల, 67 లక్షల 74 వేల 990, అమెరికాలో 32 కోట్ల, 33 లక్షల, 27 వేల 328, ఇటలీలో 4 కోట్లు 96 లక్షల 50 వేల 721, జర్మనీలో 7 కోట్ల 14 లక్షల 37 వేల 514, ఫ్రాన్స్‌లో 5 కోట్ల 24 లక్షల 57 వేల 288 మందికి టీకాలు వేశారు.
ఇదే సమయంలో భారతదేశంలో ఈ సంఖ్య 32 కోట్ల, 36 లక్షల 63 వేల 297గా ఉంది. భారతదేశంలో జూన్ 27 న 13.9 లక్షల మందికి టీకా మొదటి డోసు, 3.3 లక్షల మందికి టీకా రెండవ డోసు ఇచ్చారు. ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడం ప్రారంభించారు. మే ఒకటి నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.