భువనేశ్వర్, అక్టోబర్ 9: యూపీలోని కాన్పూర్‌లో మయూర్ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు జరిపింది. వరుసగా నాలుగో రోజు కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో దాదాపు 26 కిలోల బంగారం, రూ.4 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.41 కోట్ల పన్ను ఎగవేతకు ప్రయత్నించి మయూర్ గ్రూప్ యజమాని అడ్డంగా బుక్కయ్యాడు. మయూర్ గ్రూపులో జరిగిన సోదాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. పన్ను ఎగవేతలో అంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరుకుతుందని వారు కూడా ఊహించలేదు. ఇప్పటికీ 35 చోట్ల 150 మందికి పైగా అధికారులు దాడులు చేస్తున్నారు. 2019లో కూడా సాఫ్టాను ఉల్లంఘించిన కేసుల్లో కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేశారు. ఇప్పుడు మరోసారి రూ.41 కోట్ల పన్ను ఎగవేత కేసు బయటపడింది.
ఈ నగదను అతను ఓ సీక్రెట్ రూమ్‌లో దాచినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అధికారులు గది కీని వెదికేందుకు నానాతంటాలు పడ్డారు. తాళం కీ కూడా మరో సీక్రెట్ ప్లేస్‌లో దాచినట్లు గుర్తించారు. అతను తాళం చెవిని ఓ కుండలో దాచాడు. ఐటీ బృందం గది గోడలోని అద్దం డిజైన్‌లోని తాళాన్ని చొప్పించగా రహస్య గది తెరచుకుంది. కళ్లు చెదిరే సంపద చూసి ఐటీ అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దాదాపు 26 కిలోల బంగారం (8 కోట్లు), 4.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు రూ.41 కోట్ల SAFTA (సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా) ఫీజు ఎగవేత కూడా ఈ కేసులో వెలుగు చూసింది. ఈ మొత్తం ఆపరేషన్‌లో అనేక అక్రమాలు, పన్ను ఎగవేతలు బయటపడ్డాయి. 50 మంది అధికారులు 35కి పైగా వేరువేరుచోట్ల ఏకకాలంలో ఈ దాడులు చేశారు. ఇందులో రూ.8 కోట్ల విలువైన 26.307 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.4.53 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు కంపెనీ అక్రమ సంపాదనను దాచడానికి చాలా హైటెక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందని తెలుసుకున్న అధికారులు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లను సైతం సీజ్ చేశారు.
రూ.41 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు గంటల తరబడి గ్రూప్ యజమానిని విచారించారు. ఈ క్రమంలో ఎంఎస్ కేపీఈఎల్ ద్వారా రూ.18 కోట్ల నకిలీ కొనుగోళ్లు వెలుగులోకి వచ్చాయి. పన్ను ఎగవేసేందుకు బోగస్ కొనుగోళ్లు జరిపారని, కోట్ల విలువైన కొనుగోళ్లు చూపిన సదరు కంపెనీ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించడంలో విఫలం అయ్యింది. ప్రస్తుతం ఈ కంపెనీ వ్యవహారంపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.