Congress President Election 2022 Results Live Updates: అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే ఘన విజయం.. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిగా..

| Edited By: Basha Shek

Oct 19, 2022 | 3:19 PM

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు.  దీంతో

Congress President Election 2022 Results Live Updates: అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే ఘన విజయం.. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిగా..
Congress President Election 2022 Results

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా.. థరూర్‌కు మద్దతుగా 1072 మంది  మాత్రమే  ఓటేశారు. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలకు న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్  ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపులో మొదటి నుంచే మల్లిఖార్జున ఖర్గే  ఆధిపత్యం చెలాయించారు. కాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడి పదవి కోసం కర్ణాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేరళ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీలో ఉన్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. 9వేల మందికి పైగా ప్రతినిధులు ఓటు వేశారు. 24 ఏళ్ల తర్వాత మొదటిసారి గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో.. మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీలో నిలిచారు. అత్యంత ఆసక్తికరంగా కొనసాగిన కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల్లో.. అగ్రనేతలు స్పష్టంగా ఖర్గేకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం.. ఖర్గేకు కలిసివచ్చే అంశాలుగా పరిగణిస్తున్నారు. అటు గాంధీ కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు శశి థరూర్ సైతం గట్టి పోటీ ఇస్తారని పేర్కొంటున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఎన్నికలు రహస్య బ్యాలెట్‌ విధానంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక బరిలో లేకపోవడం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Oct 2022 02:45 PM (IST)

    ఖర్గే విజయంపై రేవంత్‌ హర్షం..

    ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారని, ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. అలాగే మాజీ ఎంపీ మల్లు రవి ఖర్గే విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

  • 19 Oct 2022 02:42 PM (IST)

    ఖర్గేకు కంగ్రాట్స్ చెప్పిన శశిథరూర్.. కాంగ్రెస్‌లో నూతన అధ్యాయం మొదలైందంటూ..

    ఏఐసీసీ చీఫ్‌గా ఎన్నికైన మల్లికార్గుణ ఖర్గేకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ అభినందనలు తెలిపారు.  ఈ రోజు నుంచి కాంగ్రెస్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు.

     


  • 19 Oct 2022 01:43 PM (IST)

    ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే గెలుపు

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలు వచ్చాయి. 7వేలకుచిలుకు ఓట్లతో ఖర్గే గెలుపొందారు.

  • 19 Oct 2022 01:09 PM (IST)

    60 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో 60 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. శశిథరూర్‌పై మల్లిఖార్జున్‌ ఖర్గేకు భారీ ఆధిక్యత లభిస్తోంది. విజయం వైపు దూసుకెళ్తున్న ఖర్గే దూసుకెళ్తున్నారు.

  • 19 Oct 2022 01:03 PM (IST)

    అధ్యక్ష ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న ఖర్గే

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపులో శశిథరూర్‌పై మల్లిఖార్జున ఖర్గే అధిక్యంలో ఉన్నారు. ఖర్గే విజయం వైపు దూసుకెళ్తున్నారు.

  • 19 Oct 2022 12:41 PM (IST)

    అక్రమాలకు సంబంధించి ఆధారాలు సమర్పణ

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని శశిథరూర్‌ ఆరోపించిన నేపథ్యంలో అక్రమాలకు సంబంధించి ఫోటోలు, ఆధారాలను కూడా సమర్పించారు. మల్లికార్జున ఖర్గే ఎన్నిక లాంఛనమే అని పార్టీ వర్గాలు భావిస్తున్న వేళ.. శశిథరూర్‌ కు ఎజెంట్‌గా ఉన్న నేత ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

  • 19 Oct 2022 12:39 PM (IST)

    అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్‌ సంచలన కామెంట్స్‌

    కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్న వేళ.. అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వెల్లడించడం పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి శశి థరూర్ ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ ఫిర్యాదు చేశారు.

  • 19 Oct 2022 11:58 AM (IST)

    మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం

    ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. ఇద్దరు అభ్యర్థుల సమక్షంలో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

  • 19 Oct 2022 11:36 AM (IST)

    కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు

    ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్లను కలగలిపి కట్టలు కట్టిన అనంతరం ఓట్లను లెక్కించనున్నారు. అభ్యర్థులు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ సమక్షంలో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

  • 19 Oct 2022 11:17 AM (IST)

    మల్లికార్జున్ ఖర్గే కౌంటింగ్ ఏజెంట్లు

    ఖర్గే కౌంటింగ్ ఏజెంట్లుగా ప్రమోద్ తివారీ, కొడికునిల్ సురేష్, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుల్జీత్ సింగ్ బగ్రా మరియు గుర్దీప్ సింగ్ సప్పల్ ఉన్నారు.

  • 19 Oct 2022 11:16 AM (IST)

    శశి థరూర్ కౌంటింగ్ ఏజెంట్లు

    కార్తీ చిదంబరం, అతుల్ చతుర్వేది, సుమేద్ గైక్వాల్‌లు శశి థరూర్‌కు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నారు.

  • 19 Oct 2022 10:21 AM (IST)

    అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు

    ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికలకు కౌంటింగ్‌ కొనసాగుతోంది. మల్లిఖార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ సమక్షంలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 9500 ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

  • 19 Oct 2022 10:14 AM (IST)

    చివరి సారిగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే..

    చివరిసారిగా 2000లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీపై జితేంద్ర ప్రసాద్ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ 7,400 ఓట్లు పొందగా, జితేంద్ర ప్రసాద్‌కు కేవలం 94 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశం ఉంది.

  • 19 Oct 2022 10:09 AM (IST)

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ కౌంటింగ్ ప్రారంభమైంది.

  • 19 Oct 2022 09:52 AM (IST)

    స్వాతంత్ర్యానంతరం 1950లో జరిగిన తొలి ఎన్నికలు

    స్వాతంత్ర్యానంతరం 1950లో జరిగిన తొలి ఎన్నికలు జరిగాయి. 1977లో జరిగిన ఎన్నికల్లో సిద్ధార్థ శంకర్ రాయ్, కరణ్ సింగ్‌ను ఓడించారు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆ తర్వాత మళ్లీ 20 ఏళ్లకు 1997లో త్రిముఖ పోటీలో శరద్ పవార్, రాజేశ్ పైలట్‌ను సీతారాం కేసరి ఓడించారు. నాటి ఎన్నికల్లో సీతారాం కేసరి 6,224 ఓట్లు పొందగా, శరద్ పవార్‌కు 882, రాజేశ్ పైలట్‌కు 354 ఓట్లు వచ్చాయి.

  • 19 Oct 2022 09:25 AM (IST)

    137 ఏళ్ల చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు

    ఈ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మధ్య పోటీ జరిగింది. 137 ఏళ్ల చరిత్ర పార్టీలో 6వ సారి జరిగిన ఎన్నికలు జరిగాయి. 1939లో తొలిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మహాత్మ గాంధీ బలపర్చిన పి. సీతారామయ్యను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓడించారు.

  • 19 Oct 2022 09:23 AM (IST)

    68 పోలింగ్‌ బూత్‌ల నుంచి బ్యాలెట్‌ పత్రాలు

    68 పోలింగ్‌ బూత్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పర్చారు సిబ్బంది. మొత్తం 9,915 మంది పీసీసీ డెలిగేట్లలో 9,500 మందికి ఓటు వేశారు.

  • 19 Oct 2022 09:19 AM (IST)

    ఢిల్లీకి చేరుకున్న బ్యాలెట్‌ పత్రాలు

    ఈ కౌంటింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానినిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ల నుంచి బ్యాలెట్‌ పత్రాలు ఢిల్లీకి చేరుకున్నాయి.

  • 19 Oct 2022 09:17 AM (IST)

    నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు

    కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరుగనుంది.

Follow us on