దంచుడే దంచుడు..! గ్యాప్ లేకుండా కురుస్తోన్న కుండపోతకు దేశం అతలాకుతలం

దంచుడే దంచుడు..! గ్యాప్ లేకుండా కురుస్తోన్న కుండపోతకు దేశం అతలాకుతలం

Ravi Kiran

|

Updated on: Aug 26, 2024 | 3:22 PM

దేశంలోని పలు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. నిత్యావసరాల కోసం అల్లాడుతున్నారు అక్కడి ప్రజలు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గ్యాప్‌ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌లో గడిచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వల్సాడ్‌ ఒక్క రాత్రే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్‌లో తాపి నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవాహిస్తోంది. ఇక మణిపూర్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

అక్కడ కూడా వాళ్లున్న ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. దాదాపు 130 కుటుంబాలు ఈ సహాయ శిబిరంలో తలదాచుకుంటున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే అక్కడ మరిన్ని ఇళ్లు నీట మునిగే ముప్పు ఉంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ఫోయ్‌సాగర్‌ సరస్సు పొంగి పొర్లుతోంది. చెరువులో భారీగా నీళ్లు చేరాయని తెలియగానే చాలా మంది ఆ దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు. ఏడారి రాష్ట్రంలో నీళ్లకు ఇక కొరత లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాబోయే 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Published on: Aug 26, 2024 08:13 AM