ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భద్రతా లోపం.. ఇమ్మిగ్రేషన్ లేకుండానే ముగ్గురు విదేశీయులు బార్డర్ దాటేశారు!
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ఇటాలియన్ పౌరులు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు లేకుండానే భారత్ నుంచి బయలుదేరారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి వచ్చి, అక్కడి నుండి మ్యూనిచ్ వెళ్ళిన ఈ ప్రయాణికుల విషయంలో ఎయిర్ ఇండియా SOP ఉల్లంఘించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం కలకలం రేపుతోంది. అవసరమైన ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్ నుంచి బయటకు వెళ్లిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 3, 4 తేదీల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు మంత్రిత్వ శాఖ నోటీసులో పేర్కొంది. ముగ్గురు ఇటాలియన్ ప్రయాణికులు అమృత్‌సర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం AI-1115లో ఢిల్లీకి చేరుకున్నారు. విమానం అర్ధరాత్రి 12:50 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా.. సుమారు గంట తర్వాత 1:45 గంటలకు లుఫ్తాన్సా LH-763 విమానంలో మ్యూనిచ్‌కు బయలుదేరారు. అయితే, భారత్ నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా చేయాల్సిన ఇమ్మిగ్రేషన్ తనిఖీ వారికి జరగలేదు.
ఎక్కడ తప్పు జరిగింది?
మంత్రిత్వ శాఖ ప్రకారం.. అమృత్‌సర్‌లో ఈ ప్రయాణికులకు ఢిల్లీ వరకు వెళ్లేందుకు ‘D’ కేటగిరీ దేశీయ బోర్డింగ్ పాస్‌లు జారీ అయ్యాయి. అదే సమయంలో ఢిల్లీ నుంచి మ్యూనిచ్‌కు వెళ్లే లుఫ్తాన్సా విమానానికి కూడా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చారు. ఈ విధానం ఎయిర్ ఇండియా డొమెస్టిక్-ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ SOPకు అనుగుణంగా లేదని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత వారిని దేశీయ ప్రయాణికుల మార్గం నుంచి ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి పంపాల్సి ఉండగా.. పొరపాటున ఇంటర్నేషనల్-టు-ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ప్రాంతానికి తరలించారు. దీంతో ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌ను దాటకుండానే వారు అంతర్జాతీయ విమానం ఎక్కారు.
ఎయిర్ ఇండియాకు ప్రశ్నల వర్షం
ఈ ఘటనలో SOPలోని పలు నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌లను ఎందుకు సరిగ్గా తనిఖీ చేయలేదు? వారు ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ప్రాంతానికి ఎలా చేరుకున్నారు? అమృత్‌సర్‌లోనే తదుపరి అంతర్జాతీయ విమానానికి బోర్డింగ్ పాస్ ఎందుకు ఇచ్చారు? ఘటన సమయంలో నోడల్ అధికారి, పర్యవేక్షణ బృందం ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానం కోరింది. అలాగే ప్రయాణికుల డేటా, ప్యాసింజర్ మ్యానిఫెస్ట్, API-PNR వివరాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సక్రమంగా అందాయా? అనే అంశంపైనా విచారణ జరుపుతోంది.
మాన్యువల్ రికన్సిలియేషన్ సమయంలో ఈ లోపం బయటపడినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంది. సంస్థ సమాధానం ఆధారంగా తదుపరి పరిపాలనా, నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
