
గోవాలో కొంతకాలంగా పర్యటకుల సంఖ్య తగ్గడంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవా బీచ్‌లో ఇడ్లీ-సాంబార్, వడా పావ్‌లు విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని కామెంట్స్ చేశారు. నార్త్ గోవాలోని కలంగూట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇడ్లీ-సాంబార్, వడా పావ్‌ల అమ్మకంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బెంగళూరు నుంచి వచ్చినవారు బీచ్ దుకాణాల్లో వడా పావ్‌లు అమ్ముతున్నారని.. మరికొందరు ఇడ్లీ-సాంబార్ విక్రయిస్తున్నారని చెప్పారు. అందుకే.. గత రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిపోయిందన్నారు. టూరిస్టులు తగ్గిపోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు ఎమ్మెల్యే మైఖేల్ లోబో. అయితే.. పర్యాటకంపై ఇడ్లీ-సాంబార్ విక్రయాలు ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించనప్పటికీ.. అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్, రష్యా పర్యటకులు కూడా గోవాకు రావడం మానేశారన్నారు లోబో. గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని, అందరూ దీనికి బాధ్యులేనని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ దుకాణాలను అద్దెకు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. గోవాకు విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడంపై కారణాలు అన్వేషించేందుకు టూరిజం శాఖతో సహా భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ట్యాక్సీలు, క్యాబ్‌ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దకుంటే పర్యటకానికి చీకటి రోజులేనని హెచ్చరించారు మైఖేల్ లోబో.
Goa BJP MLA Michael Lobo blames sale of idli-sambar in beach shacks for decline in international tourist footfall in Goa. pic.twitter.com/rqhgcLyrck
— News Arena India (@NewsArenaIndia) February 27, 2025
ప్రస్తుతం గోవా బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఎమ్మెల్యే కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వీటిని పలువుర ఖండిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..