Oxygen Supply: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన గొప్పగా సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు 21 రోజులు 1400 గంటలకు పైగా ప్రయాణం చేసి దాదాపు 500 ఆక్సిజన్ ట్యాంకర్లను మోసుకొచ్చాయి. మెడికల్ ఆక్సిజన్ సరఫరా, కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్స్‌లో వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్ సి-130జే ఎస్ విహంగాలు పాలు పంచుకున్నాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేశాయి. దేశీయంగా మా పైలట్లు 939 గంటలు పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్ కంటైనర్లు, 163.3 మెట్రిక్ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆస్పత్రులకు చేర్చాయని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఆక్సిజన్, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్ విమానాలు, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి వాయు సేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.
అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్‌కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్‌కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి. ఈ రకంగా భారత వాయుసేన ఎంతో మంది రోగుల ప్రాణాలను నిలబెట్టినట్లయింది.
దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. దేశ వ్యాప్తంగా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. వివిధ రకాలుగా రూపాంతరం చెందుతూ జనాలను పట్టి పీడిస్తోంది. కరోనాను అంతం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కరోనా కట్టడికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి.