కాంగ్రెస్‌కు ఖేదం.. మిత్రపక్షాలకు మోదం.. మూడు రాష్ట్రాల ఓటమి అనంతర పరిణామం

ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్, తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించింది. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలను ‘హస్త’గతం చేసుకుని ప్రత్యర్థులకు సవాల్ విసరడంతో పాటు మిత్రపక్షాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంది. అనుకున్నట్టు జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక బలమైన శక్తిగా కనిపించేది. విపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీలు అనివార్యంగా కాంగ్రెస్ తోక పట్టుకుని నడవాల్సి వచ్చేది. పెద్దన్న […]

కాంగ్రెస్‌కు ఖేదం.. మిత్రపక్షాలకు మోదం.. మూడు రాష్ట్రాల ఓటమి అనంతర పరిణామం
India Alliance

Edited By:

Updated on: Dec 04, 2023 | 10:55 PM

ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్, తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించింది. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలను ‘హస్త’గతం చేసుకుని ప్రత్యర్థులకు సవాల్ విసరడంతో పాటు మిత్రపక్షాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంది. అనుకున్నట్టు జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక బలమైన శక్తిగా కనిపించేది. విపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీలు అనివార్యంగా కాంగ్రెస్ తోక పట్టుకుని నడవాల్సి వచ్చేది. పెద్దన్న పాత్రలో పెత్తనం పూర్తిగా కాంగ్రెస్ చేతిలో ఉండేది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూటమి పార్టీలన్నీ అంగీకరించాల్సి వచ్చేది.

కానీ ఫలితాలు ఆ పార్టీ ఆశలను పూర్తిగా తలకిందులు చేశాయి. 5 రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరాంను పక్కనపెడితే.. మూడు పెద్ద రాష్ట్రాల్లో ఘోర పరాజయం పాలైంది. పైగా వాటిలో రెండు కాంగ్రెస్ చేతి నుంచి చేజారాయి. దాంతో కాంగ్రెస్ మిత్రపక్షాలపై పెత్తనం మాట అటుంచి.. కనీసం పెద్దన్న పాత్ర పోషించడానికే అపసోపాలు పడాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే I.N.D.I.A పేరుతో విపక్ష పార్టీలన్నీ కలిసి జట్టుకట్టాయి. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలూ కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.

కానీ తీరా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ప్రయత్నించిన కూటమి పార్టీలు సమాజ్‌వాదీ (SP), జనతాదళ్ (యునైటెడ్) పార్టీలకు అవమానమే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటమి వారికి ఒకింత సంతోషాన్నే కల్గించిందని చెప్పొచ్చు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో రాజస్థాన్‌లో అధికార పీఠాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ తమను కలుపుకుని ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని చెబుతున్నాయి.

అందుకే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత విపక్ష కూటమిలోని అనేక భాగస్వామ్య పార్టీలలో ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ వైఖరి గురించి ప్రాంతీయ పార్టీలకు తెలుసు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది. మధ్యప్రదేశ్‌లో 6 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీతో, 2 స్థానాల్లో జేడీ(యూ)తో పొత్తులకు కాంగ్రెస్ చర్చలు జరిపింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించింది. తద్వారా జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అవమానించినట్టయింది. కాంగ్రెస్ తీరుపై ఆగ్రహించిన అఖిలేశ్ యాదవ్.. మధ్యప్రదేశ్‌లో 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. నితీశ్ కుమార్ సైతం 9 మంది అభ్యర్థులను బరిలోకి దించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు బీజేపీకి మాత్రమే కాదు, కాంగ్రెస్‌కు కూడా వ్యతిరేకంగా పోరాడాయి.

ఈ మొత్తం ఘటనపై జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన తర్వాత, లాలూ ప్రసాద్ జోక్యం చేసుకుని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడవలసి వచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నితీశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్‌ కాంగ్రెస్ తీరుపై బహిరంగంగా పదునైన విమర్శలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమది “సీట్లు కోరే పార్టీ కాదు, సీట్లు ఇచ్చే పార్టీ” అన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ను రిజర్వేషన్ల వ్యతిరేకిగా అభివర్ణిస్తూ పదునైన విమర్శలు చేశారు. నితీశ్, అఖిలేశ్ మాత్రమే కాదు.. కూటమిలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సైతం కాంగ్రెస్ తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకుని.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినట్టయితే కాంగ్రెస్ మిగతా భాగస్వామ్య పార్టీలపై పెద్దన్న పెత్తనం చేస్తుందన్న భావన నేతలందరిలో ఉంది.

అందుకే నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి నేతలు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కసరత్తు ప్రారంభించకముందే సీట్ల పంపకాల ఫార్ములా ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సీట్ల పంపకం గురించి మాట్లాడదాం అంటూ కాంగ్రెస్ దాటవేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వైఖరి మారిందని ప్రాంతీయ పార్టీలు పసిగట్టాయి. తమ ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీని ఓడించాలన్న కారణంతో ఆయా పార్టీలు కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండా మిన్నకుండిపోయాయి. సహజంగానే కాంగ్రెస్ దుస్థితి ఇప్పుడు కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు ఉపశమనం కలిగించే వార్త. సీట్ల పంపకాలు సహా కూటమి తీసుకునే ఉమ్మడి నిర్ణయాల్లో తమ స్వరం పెంచి వినిపించడానికి ఆస్కారం ఉందని ఇప్పుడు మిగతా పార్టీలు భావిస్తున్నాయి.

పాట్నాలో విపక్షాల తొలి సమావేశం జరిగిన తర్వాతనే కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల కూటమిని హైజాక్ చేయడం ప్రారంభించింది. నిజానికి నితీశ్ కుమార్ చొరవ తీసుకుని విపక్ష పార్టీలను ఒక వేదికపైకి చేర్చారు. కానీ రెండవ సమావేశం నుంచే కాంగ్రెస్ పార్టీ నితీశ్‌ను పక్కన పెట్టడం ప్రారంభించింది. రెండో సమావేశం సందర్భంగా బెంగళూరులో నితీష్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి కించపరిచే ప్రయత్నాలు కూడా జరిగాయి. ముంబైలో మూడవ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్ ఆ సమావేశాన్ని దాదాపుగా హైజాక్ చేసింది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడి చేయాలని ప్లాన్ చేసింది. కానీ ప్రతిపక్ష కూటమిలోని మిగతా పార్టీల నేతలకు ఈ విషయం తెలియదు. ముంబైలోని అదే హోటల్ నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ – పారిశ్రామికవేత్త అదానీకి ఉన్న సంబంధాలపై విమర్శలు చేయడం మొదలుపెట్టగానే.. పక్కనే ఉన్న మమతా బెనర్జీ అసౌకర్యంగా వ్యవహరించారు. ఇలాంటివి ఏవైనా చేసే ముందు భాగస్వాములందరినీ సంప్రదిస్తే బావుండేది. అలాంటిదేమీ లేకుండా రాహుల్ గాంధీని మోదీపై పోరాడుతున్న యోధుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని కూటమి పార్టీలు అంగీకరించడం లేదు.

మమత అసంతృప్తి, నితీష్ కుమార్‌ను పక్కన పెట్టడాన్ని గమనించిన అరవింద్ కేజ్రీవాల్‌కు ముందే మేల్కొన్నారు. ఢిల్లీలోని అన్ని సీట్లలో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రణాళిక గురించి తెలుసుకున్న వెంటనే కేజ్రీవాల్ మునుపటి ప్రణాళిక ప్రకారం ఐదు రాష్ట్రాల్లో తన పార్టీ ఎన్నికల కార్యక్రమాలను కొనసాగించారు. అదే సమయంలో పంజాబ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై కేజ్రీవాల్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీస్తూ వచ్చింది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అవకాశం కల్పించినా అంతిమంగా తమకే నష్టం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుపై మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కొంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌తో సీట్లను పంచుకోవడం వల్ల తమ పట్టు కోల్పోయే అవకాశం ఉందని ఈ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో దూరం పాటించడమే ప్రయోజనకరం అని లెక్కలు వేస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఓటమి తర్వాత నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కాంగ్రెస్‌ను ఇకపై పెద్దన్న తరహాలో పరిగణించకపోవచ్చు. కర్ణాటక విజయగర్వాన్ని తగ్గించుకుని కాంగ్రెస్ అన్ని పార్టీలతో సమన్వయంతో పనిచేయడం అనివార్యంగా మారింది. నితీశ్ కుమార్ వంటి నేతల పాత్ర, ప్రమేయం కూటమిలో క్రియాశీలకంగా మారవచ్చు. మొత్తంగా కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ ఖేదాన్ని మిగిల్చితే, దాని మిత్రపక్షాలకు మాత్రం మోదంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..