వారిద్దరూ వృద్ధులే.. భర్త రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య హౌస్ వైఫ్.. బిర్యానీ తెచ్చుకున్న ఆ భర్త ఇంట్లో ఒక్కడే కూర్చుని తిన్నాడు. అది చూసిన భార్య తనకెందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఇంకేముంది.. గొడవ షురూ. ఆ గొడవ కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. బిర్యానీ గురించి ప్రశ్నించిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు భర్త. తనకే నిప్పంటిస్తావా? అంటూ ఆ మంటలతోనే వెళ్లి భర్తను పట్టుకుంది భార్య. కట్ చేస్తే ఆస్పత్రిలో ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరుణాకరన్(75), రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన భార్య పద్మావతి(66). చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే, గత రాత్రి కరుణాకరన్ బిర్యానీ తెచ్చుకుని ఒక్కడే తిన్నాడు. అక్కడే గొడవ మొదలైంది. తనకెందుకు బిర్యానీ తీసుకురాలేదని భర్తను అడిగింది భార్య. దానికి స్పందించిన భర్త కరుణాకరన్.. ‘అబ్బో బిర్యానీ కావాలంట.. ఒక్కరోజైనా వంట సరిగా చేశావా’ అంటూ సాగదీశాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మాటామాటా పెరిగింది. ఇద్దరూ ఎంతకూ తగ్గలేదు. చివరకు కరుణాకరన్‌కు కోపం పీక్స్‌కు వెళ్లింది. కోపం పట్టలేక భార్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తనకే నిప్పు అంటిస్తావా అంటూ.. ఆ మంటలతోనే భర్తను కౌగిలించుకుంది భార్య పద్మావతి. దాంతో ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. ఆ మంటల దాటికి ఇద్దరూ పెద్ద పెద్దగా అరిచారు. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, పరిస్థితి చెప్పలేమంటున్నారు వైద్యులు.
బిర్యానీ దగ్గర మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చింది. అయినా ఈ వయసులో ఇంత గొడవేంటోనని ఇరుగు పొరుగు నిట్టూర్పులు చెన్నై అంతటా వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..