
2019లో ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించింది. ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో.. జనజీవనం పూర్తిగా నిలిచిపోయింది. అంతకముందు భారతదేశంలోని కేరళలో నిపా వైరస్ వణికించిన ఘటనను కూడా చూశాం. తాజాగా మరో రాష్ట్రంలో కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. అది కూడా కేరళ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడు. కోవిడ్ పేరు చెబితే చాలు.. అప్పటి పరిస్థితులు కళ్ల ముందు కనబడుతుంటాయి. ఎక్కడ చూసినా లాక్‌డౌన్, బయటకు వెళ్లాలంటే ఆంక్షలు.. మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. కుటుంబ సభ్యులతో కూడా సాధారణంగా పక్కనే ఉండలేని పరిస్థితి. ఇక ఆస్పత్రుల్లో భయానక దృశ్యాలు, ఆక్సిజన్ అందక వేలాది మంది మృత్యువాత.. కరోనా మృతులతో మార్చురీలు కూడా సరిపోక గదుల్లో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు. స్మశానాలన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టినంత దృశ్యాలు. అలాంటి వాతావరణం నుంచి బయటపడడానికి కొన్ని నెలల సమయం పట్టింది. అంతా సర్దుకుంది అనుకుంటుండగా ఇప్పుడు దేశంలో అలాంటి వైరస్ మళ్లీ భయపెడుతోంది.
తమిళనాడులో బయటపడ్డ కొత్త వైరస్ ఆందోళనను పెంచుతోంది. ఆ వైరస్‌ను ప్రస్తుతం ‘ఫ్లూ వైరస్’గా పిలుస్తున్నారు. వేగంగా విజృంభిస్తున్న వైరస్ ప్రభావంతో జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. మాస్క్ లేకుండా ఎవరు బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. కోయింబత్తుర్ జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండడంతో.. ఆ జిల్లావ్యాప్తంగా అలెర్ట్ జారీ చేసిన కలెక్టర్.. పక్క జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా ఈ ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
ముందుగా జ్వరం వస్తోంది. ఆ తర్వాత ఒళ్లునొప్పులు.. ఈ రెండు లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ లక్షణాలే అనుకుని వైద్యులు కూడా అదే తరహా చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొత్త లక్షణాలు బయటపడటంతో వైద్యులు సైతం ఆందోళన పడ్డారు. ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి రావడం ఈ ‘ఫ్లూ వైరస్’ లక్షణాలుగా ఉన్నాయి.
చిన్నపిల్లలు, వృద్దులలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ చిన్నారులు, యాభై ఏళ్ళ పైబడ్డ వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
రెండు రోజుల నుంచి కోయింబత్తూర్ జిల్లాలో ఎక్కువగా ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు – కేరళ సరిహద్దు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఎవరు మాస్క్ లేకుండా తిరగరాదని ఆదేశాలు జారీ చేశారు. కోయంబత్తూర్‌లో నెలకొన్న పరిస్థితులపై తమిళనాడు ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి జ్వరం లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వైరస్‌కి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళలో ముందుగా ఈ వైరస్ బయట పడి ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో కేరళ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. చాలా చోట్ల సరిహద్దు మార్గాలను మూసివేసి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా తమిళనాడులో ఎక్కడైనా ఇలాంటి కేసులు నమోదయ్యయా అనే అనుమానంతో వివరాలు సేకరిస్తున్నారు.