Honor killing: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని నెల రోజుల్లో కూతురు, అల్లుడిని కడతేర్చాడు.. పరువు పోయిందని..
గ్రామ పంచాయితీలో పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చిన తరువాత కూడా హత్యలకు పాల్పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది.
Honor killing in Tamil Nadu: దేశంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని పెళ్ళైన నెలరోజుల్లోనే కూతురుని, అల్లుడిని నరికి చంపాడు ఓ తండ్రి.. గ్రామ పంచాయితీలో పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చిన తరువాత కూడా హత్యలకు పాల్పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని వీరపట్టి గ్రామానికి చెందిన ముత్తుకుట్టి. కుమార్తె రేష్మ కోవిల్‌పట్టిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతుండగా.. స్థానికంగా అదే ప్రాంతానికి చెందిన మాణికరాజ్‌తో పరిచయం పెంచుకుంది. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడంతో పెళ్ళికి రేష్మ తండ్రి ముత్తుకుట్టి అభ్యంతరం చెప్పాడు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య విబేధాలు మొదలవడంతో ఇంట్లో నుంచి పారిపోయి రేష్మ, మాణికరాజ్ వివాహం చేసుకున్నారు.
ఈ క్రమంలో వారిద్దరూ రెండు రోజుల క్రితం ఊరికి రావడంతో.. ఇరు కుటుంబాల మధ్య మళ్లీ గొడవకి దారితీసింది. దీంతో గ్రామ పంచాయితీలో పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అదే ఊర్లో ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే కూతురిపై ముత్తుకుట్టి తీవ్ర ఆగ్రహంతో నిన్న సాయంత్రం రేష్మ, ఆమె భర్త ఇంట్లో ఉన్న సమయంలో ముత్తుకుట్టి కొడవలితో ఇద్దరిని హత్య చేసి అక్కడి నుంచి పారిపోయడు.
విషయం తెలుసుకున్న ఎట్టయ్యపురం పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్‌పట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యలకు పాల్పడ్డ ముత్తుకుట్టిని, అతనికి సహకరించిన అతని భార్యని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోవిలపట్టి పోలీసులు వెల్లడించారు. దగ్గర బంధువులైన ఈ కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాలుగా ఆస్థి తగాదాలున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..