
మే 11న వారి పెళ్లి అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. కొత్తగా పెళ్లైన జంట కదా.. హనీమూన్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతా ప్లాన్ చేసుకొని ఈ నెల 20న తమ ఇంటి నంచి బయల్దేరి షిల్లాంగ్ వెళ్లారు. అస్సోం రాజధాని గౌహటీ మీదుగా షిల్లాంగ్ చేరుకున్నారు. అయితే షిల్లాంగ్ వెళ్లే ముందు గౌహటిలోని ప్రముఖ కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత దట్టమైన అడవుల్లోకి వెళ్లి.. కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజా, సోనమ్ అనే దంపతులు గువహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణించి, దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) సందర్శించడానికి యాక్టివా స్కూటీని అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూ ముందుకు సాగారు. మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు లేరు. మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇలానే రెండు జంటలు కనిపించకుండా పోయాయి.
దంపతులిద్దరు తమతో చివరి సారిగా మే 23న ఫోన్‌లో మాట్లాడినట్లు రాజా తల్లి రీనా తెలిపారు. ఆ తర్వాత నుంచి వారి నుంచి ఫోన్ రాలేదని ఆమె పేర్కొన్నారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాగా, వారు ప్రయాణించిన అడవులు చూడడానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయో, అంతే ప్రమాదకరంగా ఉంటాయని పోలీసులు తెలిపారు. దట్టంగా చెట్లు, లోతైన లోయలు ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారినట్లు వెల్లడించారు. వీరి మొబైల్ ఫోన్ ఆధారంగా చివరి లోకేషన్ ట్రాక్ చేయగా ఓస్రా హిల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పోలీసులు తెలిపారు. మరో విషయం ఏంటంటే.. ఇక్కడ ఓ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్‌లో గతంలో పలు నేరాలు జరిగినట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. దీంతో ఆ రిసార్ట్ సిబ్బందిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆ జంట ఈ రిసార్ట్‌లో బస చేశారా? లేదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు తప్పిపోయిన ఆ జంట గురించి ఎలాంటి ఆచూకీ తెలియరాలేదు. వారు అడవుల్లో తప్పిపోయారా? లేక ఎవరైనా వారిని ఏమైనా చేశారా? అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..