దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాల్సి ఉండగా, శుక్రవారం హిమాల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ఖరారు చేసింది ఈసీ. నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ పదవీకాలం ముగియనుంది.
2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2017 నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 68 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 44 (48.79 శాతం) సీట్లు గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, సుజన్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది, ఆ తర్వాత జై రామ్ ఠాకూర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో, కాంగ్రెస్ 21 (41.68%) సీట్లు గెలుచుకోవడం ద్వారా రెండవ పార్టీగా అవతరించింది. వీరభద్ర సింగ్ ఓటమి పాలయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన పోటీ ఎప్పటినుంచో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హిమాచల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కాపాడుకోగలదా, లేకుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
☛ ఎన్నికల నోటిఫికేషన్ : అక్టోబర్ 17
☛ నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 25
☛ నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27
☛ నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 29
☛ పోలింగ్ : నవంబర్ 12
☛ ఫలితాలు : డిసెంబర్ 8
☛ మొత్తం నియోజకవర్గాలు : 68
☛ మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ఓటర్లు
☛ పురుషులు – 27,80,208
☛ మహిళలు – 27,27,016
☛ మొదటిసారి ఓటర్లు – 1,86,681
☛ 80 ఏళ్లపైబడిన ఓటర్లు – 1,22,087
☛ వందేళ్లపై ఉన్న ఓటర్లు – 1,184