Karnataka Hijab Row: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ (Hijab) వివాదం కారణంగా కర్ణాటక (Karnataka)లో మూత పడిన పాఠశాలలు నేటి (ఫిబ్రవరి14) నుంచి పునఃప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలలు, యూనివర్సిటీల ప్రారంభంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరికొన్ని రోజుల పాటు కళాశాలలు, వర్సిటీలు మూతపడనున్నాయి. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
త్వరలోనే శాంతియుత వాతావరణం..
కాగా రాష్ట్రంలో త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ పదో తరగతి వరకు పాఠశాలలు సోమవారం తెరచుకుంటాయి. కళాశాలలు, యూనివర్సిటీల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితిని మరికొన్ని రోజుల పాటు సమీక్షించిన తర్వాతే వీటి రీఓపెనింగ్ పై నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలను ఏర్పాటుచేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం’ అని సీఎం పేర్కొన్నారు. కాగా హిజాబ్ అనుకూల, వ్యతిరేక నినాదాల కారణంగా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 9న పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. పాఠశాలలు, కళాశాలలను తెరవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తరగతి గదుల్లో విద్యార్థులు హిజాబ్‌లు, స్కార్ఫ్‌లు, మతపరమైన జెండాలు ధరించకుండా చూడాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.
Also Read:Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తోన్న జగన్ సర్కారు.. ఉగాది రోజు నుంచే పాలన.. పూర్తి వివరాలివే..