తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లు కురవడమే కాకుండా.. అతనికి విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. అత్యంత ధైర్య సాహసాలతో బాలుడిని రక్షించినందుకు రైల్వే శాఖ అతనికి 50 వేల రూపాయల రివార్డును ప్రకటించింది. అయితే అందులో సగం సొమ్మును తాను ఆ బాలుడి కుటుంబానికి అందజేస్తానని ప్రకటించి మయూర్ మరింత మంది మనుసులు గెలుచుకున్నాడు. తన కుమారుడిని రక్షించినందుకు బాలుడి తల్లి ఫోన్ ద్వారా తనకు కృతజ్ఞతలు తెలిపిందని, హౌస్ వైఫ్ అయిన ఆమెకు కంటిచూపు సరిగా కనబడదని ఆయన చెప్పాడు. ఆమె భర్త కూడా చిన్న పాటి సంపాదనతో నెట్టుకొస్తున్నట్టు తెలిసిందని, ఆ పేద కుటుంబానికి ఈ సొమ్మును అందజేస్తానని అతను చెప్పాడు.
ఇతని సమయస్ఫూర్తిని, ధైర్య సాహసాలను రైల్వే అధికారులే కాక, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండర్ అనుపమ్ తరేజా అతనికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చినట్లే మయూర్‌కు బైక్ ఇచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్‌ను మయూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ కలర్‌లో ఉన్న ఈ బైక్ ధర రూ.లక్షన్నరకు పైనే కావడం విశేషం.
Also Read: దూళిపాళ్ల అరెస్టుతో ఏపీలో పొలిటికల్ ఫైట్ షురూ.. అనంతపురం నుంచి సిక్కోలు దాకా ఒకటే రచ్చ