Ratan Tata: స్నేహానికి ఎలాంటి అవధుల్లేవు.. రతన్ టాటా భుజాలపై చేయి వేసి మాట్లాడే కుర్రాడి గురించి తెలుసా..?
Ratan Tata - Shantanu Naidu Friendship: అతనొక వ్యాపార దిగ్గజం.. ఓ సంస్థకే అధిపతి.. అలాంటి వ్యక్తికి ఓ కుర్రోడు సహాయకుడు.. అదేంటి అనుకుంటున్నారా..?
Ratan Tata – Shantanu Naidu Friendship: అతనొక వ్యాపార దిగ్గజం.. ఓ సంస్థకే అధిపతి.. అలాంటి వ్యక్తికి ఓ కుర్రోడు సహాయకుడు.. అదేంటి అనుకుంటున్నారా..? అవును వ్యాపార దిగ్గజం రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు.. ఎంతలా అంటే భుజాలపై చేయి వేసేంత.. ప్రస్తుతం అతను రతన్ టాటాకు టెక్నాలజీ పాఠాలు నేర్పడమే కాకుండా.. సహాయకుడిగా బాధ్యతలు చూసుకుంటున్నాడు. టాటా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. రతన్ టాటాకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వార్తల్లోకెక్కాడు. అందుకే అందరూ అతన్ని మామూలు పిల్లవాడు కాదంటూ కితాబిస్తున్నారు. అతనే శాంతాను నాయుడు. పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శాంతాను టాటా ఎల్క్సీలో జూనియర్ డిజైన్ ఇంజనీర్‌గా చేరాడు. ప్రస్తుతం ఆ కుర్రాడే రతన్ టాటాకు అసిస్టెంట్‌గా, ఆయన ఆఫీస్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. అంతేకాదు టాటా ఇండస్ట్రీలో ఐదో తరం ఉద్యోగిగా మూడు స్టార్టప్‌లను విజయవంతంగా నడుపుతున్నాడు. స్నేహానికి వయస్సు, హోదా, ఆలోచనలు లాంటి తారతమ్యాలు లేవని వీరి స్నేహాన్ని ఉదహరణగా చూపిస్తున్నారు పలువురు ప్రముఖులు. 84 ఏళ్ల రతన్ టాటా స్నేహితుడిగా ఉంటున్న మహారాష్ట్ర పూణేకు చెందిన 28 ఏళ్ల శంతాను నాయుడు గురించి ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, శంతను నాయుడు బంధాన్ని అర్థం చేసుకున్నవారంతా ‘ఏజ్.. జస్ట్ ఎ నంబర్’ అంటూ పేర్కొంటారు. వ్యాపారంతోపాటు సామాజిక సేవలోనూ ముందుంటే.. రతన్ టాటాకు ఆప్యాయంగా పలకరించేంత చనువు, భుజాలపై చేయి వేసి మాట్లాడే స్నేహం శంతానుకు ఉంది. రతన్ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వెనుక ఆ యువకుడే ఉన్నాడు.
స్నేహం
మూగజీవాల సంరక్షణతో మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకునేవారు. ఇదే సమయంలో రతన్ టాటాకు సోషల్ మీడియాను పరిచయం చేసింది శంతను అనే పేర్కొంటారు సిబ్బంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, హ్యాష్ ట్యాగ్, ఎమోజీలు వాడటం.. సామాజిక మాధ్యమాలను మెరుగ్గా వినియోగించడంలో ఉండే మెలకువలన్నీ రతన్ టాటాకు శాంతాను నేర్పించాడు. దీనితోపాటు వ్యాపార నిర్వహణకు సంబంధించిన పలు విషయాలను రతన్‌టాటాకు కూడా చెబుతాడు. దీంతో 2017లో జంతు సంరక్షణ, హక్కుల కోసం పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్థతో కలిసి రూ.100 కోట్లతో టాటా ట్రస్ట్ ఓ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రకటించింది. ఓ వైపు శాంతాను మోటోపాస్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటూనే, పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత అమెరికాలో అతను చదువుకుంటున్న కార్నెల్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలకు సైతం రతన్ టాటా హాజరయ్యారంటే వారి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రతన్ టాటా ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు.
అసలు కథ ఇదే.. ఒకరోజు శాంతాను నాయుడు ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో.. ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు. ఆ సంఘటన అతన్ని ఎంతగానో కలచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్‌లను రూపొందించాడు. దీనికోసం విరాళాలు సైతం సేకరించాడు. ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదికి వెళ్లినప్పుడు బెల్టులోని రంగులు వాహనాల హెడ్‌లైట్స్‌కు మెరిసి పోతాయి. దీంతో వాహనదారులు నెమ్మది కావడమో, బండిని ఆపేయడమో చేస్తారనేది శాంతాను ఆలోచన. ఈ క్రమంలో వాహనాల డ్రైవర్లకు కూడా మూగజీవాలపై అవగాహన కల్పించాడు.
అయితే.. చాలామంది మూగ జీవాలకు అలాంటి బెల్టులు కావాలని కోరడంతో.. శంతను తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్‌కు లేఖ రాశాడు. దీంతో అధికారులు ముంబైకి రావాలంటూ ఆహ్వానం పంపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. ఈ సమయంలో శాంతాను బృందం రతన్ టాటాను సైతం కలిసింది. అలా శంతాను నాయుడు ‘మోటోపాస్’ సంస్థను మొదలెట్టాడు. ఔత్సాహిక ఆంత్రపెన్యూర్స్ కోసం ‘ఆన్ యువర్ స్పార్క్స్’ అనే కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా శాంతాను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నాడు. యువతకు ఉపాధి కల్పించడం కోసం ‘గుడ్‌ఫెలోస్’ అనే స్టార్టప్ సంస్థను నిర్వహిస్తూ పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
గత సంవత్సరం శంతను తన పుస్తకాన్ని ‘‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్ : ఎ షార్ట్ మెమోయిర్ ఆఫ్ లైఫ్ విత్ రతన్ టాటా’’ ప్రారంభించాడు. దీనిలో పారిశ్రామికవేత్త రతన్ టాటా.. శంతను మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవని.. వీరిద్దరి స్నేహమే ఉదహరణగా నిలుస్తోంది.
Also Read: