జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవి మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనతో ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు వెళ్తూ ఎవరైనా కనిపిస్తే వెంటనే అతణ్ని ఆపేస్తాడు. వెంటనే ఆ వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని చెంపి పంపిస్తాడు. అతనే బీహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్. అతను ఇలా చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటంటే..
ఓ రోజు రాఘవేంద్ర కుమార్ స్నేహితుడు బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి బైక్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర ఆవేదనచెందాడు రాఘవేంద్ర. ఆదే ఆయనలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడిలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఆయన 56,000 హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశాడు.
ఈ సేవ కోసం ఆయన గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్ ను అమ్మేసాడు. అంతేకాదు, తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి మరీ ఉచిత హెల్మెట్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాడు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం రాఘవేంద్ర కుమార్ సేవలను ప్రశంసించారు. దీంతో రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..