ఉత్తరాఖండ్ హల్ద్వానీలో మెగా కూల్చివేతలకు బ్రేక్ పడింది. రైల్వేశాఖ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. హల్ద్వానీలో కూల్చివేతలను ఆపాలంటూ ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దశాబ్దాలుగా అక్కడుంటున్న వాళ్లను ఖాళీ చేయించే పద్ధతి ఇది కానేకాదంది. ఇలాంటి కేసులను మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాత్రికి రాత్రే 50వేల మందిని ఉన్నఫళంగా వెళ్లగొట్టలేం కదా అంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్ట్. రైల్వేభూముల్లో ఇళ్లు కట్టుకుంటే 1947 నుంచి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వారం రోజుల్లో 4వేల 5వందల ఇళ్లను కూల్చేస్తే, వాళ్లంతా ఎక్కడి వెళ్తారంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఇళ్లు కూల్చివేయడానికి ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించింది. అక్కడ ఉన్న వాళ్లకు వేరే చోట పునరావాసం కల్పించిన తరువాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 70ఏళ్లుగా అక్కడుంటున్నవాళ్లను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోతారాంటూ అధికారులను క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. హల్ద్వానీలోని 29 ఎకరాల భూమి తమదంటూ రైల్వేశాఖ పిటిషన్ వేయడంతో కూల్చివేతలకు ఆదేశించింది ఉత్తరాఖండ్ హైకోర్టు. నోటీసులిచ్చి వారం రోజుల్లో ఇళ్లను కూల్చివేయాలంటూ గతేడాది డిసెంబర్ 20న తీర్పు ఇచ్చింది. ఆ భూముల్లో దాదాపు 4వేల 5వందల ఇళ్లు ఉండగా, నాలుగు వేలకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయ్. వీళ్లంతా ఒకవైపు ఆందోళనలు చేస్తూనే, మరోవైపు సుప్రీంను ఆశ్రయించారు. దాంతో, కూల్చివేతలను ఆపాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అందరికీ పునరావాసం కల్పించాకే ఖాళీ చేయించాలని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..