జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే వజూఖానా ప్రాంతంలో సర్వేకు న్యాయస్థానం అనుమతించలేదు. ముందుగా ఉన్న దేవాలయాన్ని కూలగొట్టి దానిపై మసీదు నిర్మించారా అన్న విషయాన్ని సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సర్వే చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వేకు అనుమతించింది. నమాజ్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, అలాగే మసీదుకు ఎటువంటి నష్టం కలుగకుండా చూడాలని వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి AK విశ్వేషా తన తీర్పులో ప్రకటించారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరి దేవీని సంవత్సరం పొడవునా పూజించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నలుగురు మహిళా భక్తులు వేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో స్వయంభూ జ్యోతిర్లింగం ఉండేదని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మసీదు ప్రాంగణంలో గతేది మే 16న నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం లాంటి ఆకృతి లభించింది. అది శివలింగమని హిందువులు, కాదు అది వాటర్ ఫౌంటెయిన్ అని ముస్లింలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ సంఘాల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణుశంకర్ జైన్ స్వాగతించారు. ఈ కేసుకు సంబంధించి ఈ తీర్పు టర్నింగ్ పాయింట్ అని ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి