పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!
ఈ వర్షాకాలంలో గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 కేసులకు చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మరో 11 నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.

ఈ వర్షాకాలంలో గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 కేసులకు చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మరో 11 నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం వైరస్ సోకిన ఏడుగురు చిన్నారులు రాష్ట్రంలోని వివిధ సివిల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు పిల్లలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గాంధీనగర్, సబర్కాంత-హిమ్మత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్ధారిత కేసులన్నీ 15 ఏళ్లలోపు పిల్లల్లోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వైరస్ ఏ ఒక్క జిల్లా లేదా గ్రామానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తుండటంతో అధికారులు విస్తృత స్థాయిలో నిఘా పెంచారు. వైరస్‌కు ప్రధాన వాహకాలైన ఇసుక ఈగలు (Sand Flies) నుంచి వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇసుక ఈగలు ఎక్కువగా కనిపించే పశుపోషణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పురుగుమందుల పిచికారీ చేపడుతున్నారు. అలాగే మట్టి ఇళ్ల గోడలలోని పగుళ్లను మూసివేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచిస్తున్నారు.
అధిక జ్వరం, వాంతులు, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించే పిల్లలను వెంటనే ఐసీయూకు తరలించి ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అత్యవసర చికిత్స అందించాలని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ బాలల ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. బహుళ అవయవ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలను నివారించేందుకు సకాలంలో చికిత్స అత్యంత కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చండీపుర వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేదు. అందువల్ల నివారణ చర్యలే అత్యంత ప్రభావవంతమైన మార్గమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని మంత్రి ప్రఫుల్ పన్సేరియా విజ్ఞప్తి చేశారు. 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో తొలిసారిగా గుర్తించిన ఈ అరుదైన వైరస్ ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపుతూ మెదడు వాపుకు దారితీస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
