Rahul Gandhi: మోదీ ఇంటి పేరు పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు శిక్ష విధిస్తూ సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమైనదేనని గుజరాత్ హైకోర్టు ప్రకటించింది. ‘‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’’అంటూ వ్యాఖ్యానించిన కేసులో రాహుల్‌కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగా.. ఈ కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఇంకా శిక్షపై స్టే విధించాలనే నియమం లేదని, దానిని అత్యంత అరుదుగా మాత్రమే ఉపయోగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ తన తీర్పులో పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై మరో 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు స్పష్టమైన వ్యక్తిత్వంతో ఉండాలన్నారు న్యాయమూర్తి. ఈ కేసులో స్టే ఇవ్వనంత మాత్రాన రాహుల్ గాంధీకి ఎటువంటి అన్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకముందు రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఏప్రిల్, మే నెలలో గుజరాత్ హైకోర్టులో వాదనలు జరిగాయి. మే 2న హైకోర్టులో వాదనలు ముగిశాయి. దానిపై ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇలాంటి కేసుల్లో స్టే విధించకపోవడం అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 389ని కోర్టులు తిరగరాయడమేనని సింఘ్వీ వాదించారు.
కాగా, ఈ కేసులో హైకోర్టు గనక స్టే విధించి ఉంటే రద్దైన రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉండేది. కానీ హైకోర్టు నిరాకరించడంతో న్యాయపరమైన ఇతర ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సి ఉంటుంది. ఇప్పటికే సెషన్స్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించడంతో ఇక ఆయనకు మిగిలింది సుప్రీంకోర్టు మాత్రమే. గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..