BJP vs AAP: ఆమ్‌ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసినా సంచనలమే. తాను సామాన్యుడినని చెప్పుకునే ఈ చీపురుపార్టీ నేత, ఒక సాధారణ ఆటోడ్రైవర్ భోజనానికి పిలిస్తే వెంటనే వెళ్లారు. రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు, అభిమానుల ఇళ్లల్లో భోజనం చేయడం షరామామూలేగానీ, అరవిందుడు మాత్రం ‘జర హఠ్‌కే’ టైప్. ఎందుకో ఈ కథనం చదవండి..
ఆటో డ్రైవర్ ఆహ్వానం మేరకు అతని ఇంటికి వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్.. వారి ఇంట్లో భోజనం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఒక పాత ఇంట్లో భోజనం చేయడం విశేషం. కానీ అంతకన్నా విశేషం మరొకటి ఉంది. ఈ ఇంటికి అరవింద్ కేజ్రీవాల్ ఆటోలో వచ్చారు.
గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌ను అహ్మదాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ విక్రమ్‌భాయి దంతాణి భోజనానికి పిలిచారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సీఎం హోదాలో అతడి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. విక్రమ్‌భాయి సొంత ఆటోలోనే విందు భోజనానికి వెళ్లడానికి సిద్ధం అయ్యారు. అయితే కేజ్రీవాల్ మనసుపడ్డారుగానీ, పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు. ఒక ముఖ్యమంత్రి ఆటోలో వెళ్లడానికి వీల్లేదన్నారు. భద్రతా సమస్యలు వస్తాయన్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం విభేదించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను ప్రజల మనిషినని చెప్పారు. చివరకు సీఎం మాటే నెగ్గింది. విక్రమ్‌భాయ్ డ్రైవింగ్ చేస్తుంటే, వెనక ఆటోలో కూర్చుని అహ్మదాబాద్ వీధుల్లో కేజ్రీవాల్ ప్రయాణించారు. ఆటో డ్రైవర్ పక్కనే పోలీసాయన కూర్చున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇలా రాత్రిపూట ఆటోలో వెళ్లడం పోలీసులకు టెన్షన్ పుట్టించింది.
ఆటోడ్రైవర్ విక్రమ్‌భాయ్ ఇంటికి వెళ్లారు అరవింద్ కేజ్రీవాల్. పాత ఇంట్లోనే వారితో కలసి కేజ్రీవాల్ భోజనం చేశారు. ముఖ్యమంత్రిని చూడటమే గగనమైన ఒక ఆటోడ్రైవర్ ఇంటికొచ్చి అతడిని కేజ్రీవాల్ ఖుషీ చేశారు. భోజనం తిన్నది కేజ్రీవాల్ అయితే, కడుపు నిండింది మాత్రం ఆ ఆటోడ్రైవర్‌కు. గుజరాత్ ఎన్నికల ప్రచారాల్లో ఇలాంటి సీన్లు ఇంకెన్ని ఉంటాయో మరి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..