ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ ఉండడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం. తొలిసారి 2019లో 34వ ర్యాంకు, 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలో నిలిచారు. 2024లో ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండో మహిళ రోష్ని నాడార్ మల్హోత్రా, మూడో మహిళ కిరణ్ మజుందార్-షా. గ్లోబల్ చేంజ్ మేకర్లలో ఈ ముగ్గురు ఈ భారతీయ మహిళలు తమ తమ రంగాలలో విశేషమైన పురోగతిని సాధించారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో 28వ స్థానంలో నిలిచిన నిర్మలా సీతారామన్ రాజకీయాలలోకి రాకముందు సీతారామన్ UKలోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్, BBC వరల్డ్ సర్వీస్‌లో కీలక పదవులను నిర్వహించారు. ఆమె భారత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఇక ఈ జాబితలో భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 81వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఆమె 60వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా 82వ స్థానంలో నిలిచారు. గతేడాది ఆమె 91వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళగా చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు.
ఈ జాబితాలో బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 8వ స్థానం, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాజీ సతీమణి మెకంజీ స్కాట్ 9వ స్థానం, ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ 23 వ స్థానంలో ఉన్నారు. కాగా ఫోర్బ్స్ యేటా వ్యాపారం, వినోదం, రాజకీయాలు, దాతృత్వం, విధాన రూపకల్పన వంటి పలు రంగాలకు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌ను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా వంద మంది శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది.