శ్రీనగర్, నవంబర్ 17: జమ్మూ-కశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య శువ్రవారం (నవంబర్ 17) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీమొత్తంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..
కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన భద్రతా దళాలు గురువారం రాత్రి స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అదే సమయంలో ఓ ఇంటి నుంచి టెర్రరిస్ట్ కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఐదుగురు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. మృతి చెందిన ఐదుగురు ముష్కరులు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన వారు అయి ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విధి కుమార్ బిర్డి మీడియాకు తెలిపారు. కుల్గామ్ జిల్లా డిహెచ్ పోరా పట్టణంలోని సామ్నో పాకెట్‌లో గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని ఆయన తెలిపారు.
కుల్గామ్ జిల్లా నెహామా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కార్డన్ అండ్ సెర్చ్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతం చుట్టూ రాత్రి అంతటా భద్రతా బలగాలు గట్టి బందోబస్తు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చీకటి పడటంతో.. పకడ్బందీ నిఘా మధ్య ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. మొత్తం 18 గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ క్రమంలో అయిదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా బుధవారం జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం స్థానిక పోలీసులు, సీఆర్ఫీఎఫ్ సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ కలి’ తర్వాత చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఆ ప్రాంతంలో చొరబాటు యత్నించడం ఇది రెండో సారి. హతమైన ముష్కరుల్లో బషీర్ అహ్మద్ మాలిక్‌తో సహా మరో ఇగ్రవాది ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. రెండు అసాల్ట్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు ఘటన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.