AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam: ఉగ్రదాడి.. బీజేపీ ఐటీ సెల్‌పై కేసు నమోదు! ఎందుకంటే..?

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత తీవ్ర వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని బిజెపి ఐటీ సెల్ ఆరోపించడంతో, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై బెంగళూరులోని పోలీసులు బిజెపి ఐటీ సెల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Pahalgam: ఉగ్రదాడి.. బీజేపీ ఐటీ సెల్‌పై కేసు నమోదు! ఎందుకంటే..?
Bjp
SN Pasha
|

Updated on: Apr 24, 2025 | 7:57 PM

Share

కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా కశ్మీర్‌లో ఉగ్ర దాడి జరుగుతుందని కర్ణాటక బిజెపి ఐటీ సెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) లా అండ్ హ్యూమన్ రైట్స్ యూనిట్ అధ్యక్షుడు సి.ఎం. ధనంజయ ఫిర్యాదు చేశారు, ఈ ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బిజెపి ఐటీ సెల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని జతచేసి ‘రాహుల్‌ గాంధీ దేశం విడిచి వెళ్ళిన ప్రతిసారీ స్వదేశంలో ఏదో ఒక దుష్టశక్తి బయటపడుతుంది’ అని బిజెపి సోషల్ మీడియాలో రాసింది. ఈ పోస్ట్ సమాజంలో శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని, సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందంటూ, అలాగే రాహుల్ గాంధీ పరువుకు భంగం కలిగించే, అవమానకరమైన తప్పుడు సమాచారంతో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు పాల్పడిన బిజెపి కర్ణాటక ఐటీ సెల్ ఇంఛార్జ్‌, ఇతరులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధనంజయ్ పోలీసులను కోరారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి అంటే దేశంపై జరిగిన దాడి. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి మేం ఐక్యంగా నిలబడతాం. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. కాబట్టి, మనం తగిన విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ విషయంలో మనమందరం ఒకటే. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఏ రాజకీయ నాయకుడు ఉగ్రవాద దాడుల అంశాన్ని రాజకీయం చేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాడు. ఉగ్రవాదులను తరిమికొట్టాలి అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..