Amit Shah: రాజకీయాల్లో నమ్మక ద్రోహం చేసేవారిని, వెన్నుపోటుపొడిచేవారిని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల ముంబై(MUMBAI) పర్యటనలో భాగంగా సోమవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సహం నింపే ప్రయత్నం చేశారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నమ్మక ద్రోహం చేశారని.. దానికి తగిన శిక్ష వారు అనుభవించాల్సిందేనని ఘాటువ్యాఖ్యలు చేశారు. వచ్చే ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా. ఉద్ధవ్ ఠాక్రేకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 227 స్థానాలున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ లో 150కి పైగా సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా దిశానిర్ధేశం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాధ్ షిండే వర్గానికి మధ్య కొనసాగుతున్న న్యాయపోరాటంలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేననే నిజమైనదని చెప్పారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వెన్నుపోటు పొడిచేవారు ఎప్పటికి విజయం సాధించలేరని పరోక్షంగా ఉద్దవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధిపత్యం చెలాయించాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు. నరేంద్రమోదీ, దేవేండ్రఫడ్నవీస్ పేర్లతో ఓట్లు అడిగిన ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీకి నమ్మకద్రోహం చేశారని.. దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అమిత్ షా పేర్కొన్నారు. కాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఏం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్ గృహాలను సందర్శించి వినాయకుడి పూజలో పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రముఖులతోనూ అమిత్ షా సమావేశమయ్యారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టితో అమిత్ షా సమావేశమయ్యారు. ఈసమావేశంలో రాజకీయాల గురించి చర్చించారా లేదా మర్యాదపూర్వకమైన సమావేశమా అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు ఎక్కడైనా పర్యటనకు వెళ్లినప్పడు ఆప్రాంతంలో సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఆగష్టు నెలలో అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో సినీ నటుడు ఎన్టీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే.
Met noted director Rohit Shetty, today in Mumbai. pic.twitter.com/pfzPI2c3j6
— Amit Shah (@AmitShah) September 5, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..