Milk: ఆ గ్రామాల్లో పాలు తాగటం మానేస్తున్న ప్రజలు.. భయంకరమైన కారణమే ఉంది..

Milk: పాలు కొందరికి నచ్చక తాగని వారుంటారు. కానీ, పాలంటే ఇష్టపడే వారుకూడా ఇప్పుడు వాటిని చూస్తేనే భయపడుతున్నారు. ఒక్కొక్కరుగా పాలు తాగడమే మానేస్తున్నారు.

Milk: ఆ గ్రామాల్లో పాలు తాగటం మానేస్తున్న ప్రజలు.. భయంకరమైన కారణమే ఉంది..
Milk
Follow us

|

Updated on: Sep 05, 2022 | 3:31 PM

Milk: పాలు కొందరికి నచ్చక తాగని వారుంటారు. కానీ, పాలంటే ఇష్టపడే వారుకూడా ఇప్పుడు వాటిని చూస్తేనే భయపడుతున్నారు. ఒక్కొక్కరుగా పాలు తాగడమే మానేస్తున్నారు. దీనికి పెద్ద కారణమే ఉంది. రాజస్థాన్, గుజరాత్‌, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలకు లంపీ వైరస్ భమం పట్టుకుంది. పాడి పశువుల్లో లంపీ వైరస్ విస్తరిస్తోంది. మనుషుల్లో కరోనా వైరస్ మాదిరిగానే పశువుల్లోనూ ఈ లంపీ వైరస్ విస్తరిస్తోంది. ఈ లంపీ వైరస్ కారణంగా భారీ సంఖ్యలో ఆవులు, గేదెలు చనిపోతున్నాయి.

అయితే, లంపీ వైరస్‌తో ప్రభావితమైన ఆ పశువుల పాల నుంచి మనుషులకు ఈ వైరస్ సంక్రమిస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దాంతో ప్రజల్లో ఈ పాల పట్ల తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వైద్యులు మాత్రం అలా ఏమీ జరుగదని, పాలను బాగా మరిగించి తాగాలని సూచిస్తున్నారు. గత మూడు నెలల కాలంలో దేశంలో 50 వేల ఆవులు, ఇతర పశువులు మృత్యువాత పడ్డాయి. అంతేకాక, లక్షలాది ఆవులు ఈ వైరస్ ప్రభావానికి గురయ్యాయి. ఈ వ్యాధి తీవ్రత రాజస్థాన్‌లో ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడించారు. లంపీ వైరస్ కారణంగా ఒక్క రాజస్థాన్‌లోనే 25 వేల ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ వ్యాధి కారణంగా లక్షల ఆవులు, గేదెలను ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు పశువైద్యులు.

ఇక లంపీ వైరస్ ప్రభావంతో రైతులు, పాడి పరిశ్రమ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైరస్ భయంతో గ్రామాల్లో పాల అమ్మకాలు పడిపోయాయి. ఈ వైరస్ కారణంగా దాదాపు 2 కోట్ల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దేశంలోని డెయిరీ పరిశ్రమకు రూ. 15 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇది మనుషులకు సైతం సోకుతోందని పుకార్లు వస్తుండటంతో.. ప్రజలు సైతం పాలు తాగేందుకు జంకుతున్నారు. అయితే, ఇవన్నీ తప్పుడు వార్తలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనుషుల్లో లంపీ వైరస్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

అసలేమిటి లంపీ వైరస్?

ఈ లంపీ వైరస్.. కాప్రీపాక్స్ ఫ్యామిలీకి చెందిన ప్రమాదకర వైరస్. ఈ కుటుంబానికి చెందిన వైరస్ లతో స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ వంటి వ్యాధులు కలుగుతాయి. దీనికి సంబంధించిన వివరాలను స్టేట్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవి ఇస్రానీ వెల్లడించారు. గోట్ పాక్స్, షీప్ పాక్స్ తరహాలోనే ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చర్మంపై బొబ్బలు (లంప్‌లు) వస్తాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఆవులు, బర్రెల్లో మాత్రమే ఈ లంపీ వైరస్ కనిపించిందని తెలిపారు. అయితే, ఈ లంపీ వైరస్.. పశువుల్లో తీవ్రమైన చర్మ వ్యాధికి కారణమవుతోంది. ఈ వ్యాధిని లంపీ స్కిన్ డిసీజ్(LSD)గా పిలుస్తున్నారు.

ఈ వ్యాధి సోకిన పశువుల్లో కన్పించే లక్షణాలు..

ఇన్ ఫెక్షన్ కు గురైన పశువుల్లో ప్రారంభంలో 106 డిగ్రీల జ్వరం కన్పిస్తుంది. ఈ సమయంలో అన్ని లింప్ గ్రంథుల పరిమాణం విస్తరిస్తుంది. చర్మంపై బొబ్బలు (లంప్‌లు) వస్తాయని పశు వైద్యులు వెల్లడించారు. ఇవి పశువుల చర్మానికి శాశ్వతంగా నష్టం కలిగించే అవకాశముందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ వ్యాధి కారణంగా పాడి పశువుల్లో పాలిచ్చే శక్తి తగ్గిపోతుందని తెలిపారు. శరీరం పెరుగుదల మందగిస్తుంది. సంతాన సాఫల్యత శక్తి క్షీణిస్తుంది. ఒకవేళ చూళుతో (గర్భం) ఉన్న పశువులు అబార్షన్ కు గురవుతాయి. చాలా సందర్భాల్లో లంపీ వైరస్ సోకిన పశువులు మృతి చెందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

లంపీ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

లంపీ వైరస్ అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమ ఉన్న వాతావరణంలో వేగంగా విస్తరిస్తుంది. దోమలు, ఈగలు ఈ వైరస్ వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తాయి. అంతేకాక, ఈ వైరస్ రక్తం, ముక్కు స్రావాలు, లాలాజలం, వీర్యం ద్వారా ఇతర పశువులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదె ల నుంచి పాలు తాగిన దూడలకు కూడా సంక్రమిస్తుంది.

వైరస్ గుర్తింపు..

వైరస్ సోకిన ఆవుల్లో లక్షణాలు కన్పించడనికి 4-14 రోజులు పడుతుంది. ఈ రోజులను ఇంకుబేషన్ పీరియడ్ గా చెబుతున్నారు వైద్యులు. వైరస్ బారిన పడ్డ పశువుల చొంగ(లాలాజలం)లో 11 రోజుల్లో లంపీ వైరస్ కన్పిస్తుంది. పశువుల వీర్యంలో 22 రోజుల తర్వాత లంపీ వైరస్ కన్పిస్తుంది. చర్మంపై కన్పించే లంప్స్ లో 33 రోజుల్లో ఈ వెరస్ ఆనవాళ్లను గుర్తించవచ్చు. అయితే ఈ వైరస్ ఆనవాళ్లు మూత్రం, మలంలో కన్పించదు.

తొలిసారిగా జాంబియాలో గుర్తింపు..

1929లో తొలిసారిగా ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో లంపీ వైరస్ గుర్తించారు. 1950 నాటికి దాదాపు ఆఫ్రికా దేశాలన్నింటికి విస్తరించింది ఈ వైరస్. 1989 నాటికి ఇజ్రాయెల్ లో కన్పించింది ఈ లంపీ వైరస్. గత దశాబ్దంనాటికి మిడిల్ ఈస్ట్రన్, ఈయూ, పశ్చిమాసియా దేశాలకు లంపీ వైరస్ విస్తరించింది. 2019లో బంగ్లాదేశ్‌లో దాదాపు 5 లక్షల పశువులకు ఈ లంపీ వైరస్ సోకింది. 2022 ప్రారంభంలో పాకిస్తాన్ కరాచిలోని పశువుల్లో వైరస్ ఉనికి బహిర్గతమైంది.

భారత్ లో..

ఏప్రిల్ 2022 నుంచి లంపీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గుజరాత్ లోని కచ్ లోని గోశాలలో కొన్ని ఆవుల్లో లంపీ వైరస్ గుర్తించారు. జులై 2022 నాటికి గుజరాత్ లోని 14 జిల్లాల్లో లంపీ వైరస్ వ్యాప్తి చెందింది. జులై 25 నాటికి మొత్తం గుజరాత్ లో 37వేల లంపీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 1000 ఆవుల మృతి చెందాయి. 2022 ఆగస్ట్ 27 నాటికి రాజస్థాన్ లోని 22 జిల్లాల్లో లక్షకుపైగా పశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు పశువైద్యులు.

లంపీ వైరస్ తో ఆవుల మృతి..

లంపీ వైరస్ కారణంగా చాలా పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్క రాజస్థాన్ లోనే 25 వేలను మించి ఆవులు మృతి చెందాయి. పంజాబ్ లో 10వేల ఆవులు మృతి చెందగా.. గుజరాత్ లో 3800, హర్యానాలో 833, హిమాచల్ ప్రదేశ్ లో 513, ఉత్తరాఖండ్ లో 92, యూపీలో 8, మహారాష్ట్రలో 8, అండమాన్ నికోబార్ దీవుల్లో 29 పశువులు మృతి చెందాయి.

గుజారాత్ తో వైరస్ తీవ్రత..

మిగతా పశువులతో పోలిస్తే ఆవులపై లింపి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. గేదెలతో పోలిస్తే ఆవుల వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ కారణంగా గుజరాత్‌లో ప్రతీ రోజు 30 నుంచి 40 ఆవులు మరణిస్తున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అటు ఉత్తరప్రదే్శ‌లోని గోశాలల్లోనూ లంపీ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాజస్థాన్ లోని పలు జిల్లాల్లోని గోశాలలో పెద్దఎత్తున ఆవులకు వైరస్ సోకిందని వెల్లడైంది. ఎద్దుల్లోనూ కొన్ని కేసులు కన్పిస్తున్నప్పటికీ, 90 శాతం కేసులు ఆవుల్లోనే కనిపిస్తున్నాయంటున్నారు వెటర్నరీ అధికారులు.

పశువులకు ఐసోలేషన్, కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు..

లంపీ వైరస్ కారణంగా సోకుతున్న లంపీ స్కిన్ డీసిజ్ కొవిడ్ తరాహాలో విస్తరిస్తుందని వెల్లడించారు అధికారులు. లంపీ వైరస్ సోకిన ప్రతీ 100 ఆవుల్లో 10 మృతి చెందుతున్నాయని వెల్లడించిన వెటర్నరీ అధికారులు. కరోనా వైరస్ నుంచి మనుషులను రక్షించడానికి ఐసోలేషన్ లేదా కంటైన్మెంట్ లో ఉంచినట్లే.. లంపీ వ్యాధి సోకిన పశువులకు సైతం ఐసో లేషన్‌లో ఉంచుతున్నారు అధికారులు. వైరస్ ప్రభావిత ప్రాంతాలను కంటెన్మెంట్ జోన్ గా ప్రకటిస్తున్నారు. కరోనా టెస్ట్ ల మాదిరే పశువులకు లంపీ వైరస్ టెస్ట్ లను చేస్తున్నారు వెటర్నరీ వైద్యులు. ఈ వైరస్ వ్యాధి నియంత్రణకు గోట్ పాక్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ ఇవ్వవచ్చని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే రాజస్థాన్ లోని 22 జిల్లాల్లో లంపీ వైరస్ విస్తరించింది. దాదపుగా 8 లక్షల ఆవులు, ఇతర పాడి పశువులకు లంపీ వైరస్ సోకింది. పంజాబ్ లో 1.25లక్షల కేసులున్నాయి.

వ్యాక్సినేషన్ తీరు..

రాజస్థాన్ లో 2 లక్షల ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. పంజాబ్ లో 5.40 లక్షల ఆవులకు ఇచ్చారు. గుజరాత్ లో 4.5 లక్షలు, హర్యానా 5 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ లో 50వేలు, ఉత్తరాఖండ్ లో 20 వేలు, మహారాష్ట్రలో 36వేలు, రాజస్థాన్, యూపీలు లక్షల సంఖ్యల్లో టీకాలను ఆర్డర్ చేశారు.

దేశీ ఆవులపై వైరస్ ప్రభావం తక్కువే..

సంకర జాతి ఆవుల్లో ఎక్కువగా, దేశీ ఆవు జాతుల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు నిపుణులు. రాజస్థాన్ లో వైరస్ కారణంతో 25వేల అవులు మృతి చెందాయి. దేశీ ఆవులు రోజుకు 2.6 లీటర్లు పాలు ఇస్తాయి. విదేశీ ఆవులు రోజుకు 8.8 లీటర్ల పాలు ఇస్తాయి. సంకర జాతి ఆవులు రోజుకు 10-15 లీటర్ల పాలను ఇస్తాయి. తాజాగా వైరస్ కారణంగా ఎక్కువ శాతం సంకర జాతి ఆవులే ప్రభావితమవుతున్నాయి. ఎక్కువ శాతం మరణిస్తున్నవి కూడా సంకరజాతి ఆవులే.

ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న భారత్..

ప్రపంచ మార్కెట్‌లో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉంది. 2020-21లో 20.90 కోట్ల టన్నుల పాల ఉత్పతి జరిగింది. లంపీ వైరస్ కారణంగా దేశంలో 15-20శాతం పాల ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. డెయిరీ పరిశ్రమకు రూ. 15వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు.

పాలకు దూరం..

లంపీ వైరస్ ప్రభావంతో పశులు పాలు తాగాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఈ వైరస్ సోకిన పశువుల పాలు తాగితే తమకూ వైరస్ సంక్రమిస్తుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. దాంతో జనాలు పాలను తాగడం పూర్తిగా మానేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో పాల వాడకం పూర్తిగా తగ్గి, కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రజలు కేవలం డికాషన్ ను మాత్రమే సేవిస్తున్నారు. అయితే, ఈ పుకార్లపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. మనుషులకు లంపీ వైరస్ సోకిన దాఖలాలే లేవని స్పష్టం చేశారు. అయితే, పాలను బాగా మరిగించి తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!