
కోడలిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే ఆమె శాపమైంది.. సొంత కూతురిలా చూసుకోవాల్సిన మామే.. ఆమెపై కన్నేశాడు.. అంతేకాకుండా ఆమెపై బలత్కారం చేయబోయాడు.. ఓ వైపు మామ.. మరోవైపు భర్త వరకట్నం వేధింపులు తాళలేక.. తీవ్ర మనస్థాపానికి గురైన కోడలు నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది.. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ రంజిత తన మామగారి లైంగిక వేధింపులు, భర్త, అత్తమామల వరకట్న వేధింపులు తాళలేక నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
70 శాతం కాలిన గాయాలతో రంజిత అనే మహిళ బాధపడుతుండగా, చికిత్స కోసం మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె తీవ్ర గాయాలతో మరణించిందని పోలీసులు తెలిపారు.
అయితే.. రంజిత చనిపోయే ముందు పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన విషయాలను వెల్లడించింది. రంజిత ముఖం కాలిపోయి, బలహీనమైన స్వరంతో ఈ విషయాన్ని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. “నా మామగారు నన్ను కౌగిలించుకున్నారు. నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేను ఆత్మాహత్య చేసుకున్నాను.” అని చెప్పింది.
ఏడో తరగతి చదవుతున్న ఆమె చిన్న కుమారుడు, మరొక వీడియోలో ఆమె ఆరోపణను ప్రతిధ్వనిస్తూ, లైంగిక వేధింపుల గురించి ఆమె తనతో చెప్పిందని పేర్కొన్నాడు.
ఆమె మామగారి అసభ్యకరమైన ప్రవర్తనతోపాటు.. ఆమె భర్త, అత్తమామల నుండి వరకట్న వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె కుటుంబం ఆరోపించింది.
రంజిత సోదరి అలగసుందరి విలేకరులతో మాట్లాడుతూ.. “13 సంవత్సరాలుగా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వారు ఒక స్థలం, బంగారం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆమె మామ ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె ఈ విషయాన్ని చెబుతూనే ఉంది. ఆమె భర్త తాగేవాడు, ఆమెను కొట్టేవాడు, మౌనంగా అన్నీ భరించమని చెప్పేవాడు.. ఆమెను మమ్మల్ని చూడటానికి వారు అనుమతించరు.. ఆమె అలా చేస్తే తిరిగి తీసుకెళ్లబోమని బెదిరించారు.”.. అంటూ చెప్పింది.
స్థానిక పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. “ఆమె తన మామ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
వరకట్న వేధింపులకు సంబంధించి కుటుంబం చేస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించగా.. “వారు 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇది సాంకేతికంగా వరకట్న నిషేధ చట్టం కిందకు రాకపోవచ్చు, కానీ మేము అన్ని అంశాలను పరిశీలిస్తున్నాము.” అని తెలిపారు.
కాగా.. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.. ఇది చాలా ఇళ్లల్లో పెళ్లి తర్వాత వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల దుస్థితిపై కొత్త ఆందోళనలను రేకెత్తించింది. రంజిత మరణంపై సమగ్రమైన.. సున్నితమైన దర్యాప్తు జరపాలని మహిళ సంఘాల నేతలు కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..