Chakka Jam: దేశవ్యాప్తంగా రైతుల ‘చక్కా జామ్’.. చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతం..

Chakka Jam - Farmers Protest: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శనివారం అన్నదాతలు చేపట్టిన ‘చక్కా జామ్’ ఆందోళనలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి..

  • Shaik Madarsaheb
  • Publish Date - 5:10 pm, Sat, 6 February 21
Chakka Jam: దేశవ్యాప్తంగా రైతుల ‘చక్కా జామ్’.. చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతం..

Chakka Jam – Farmers Protest: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శనివారం అన్నదాతలు చేపట్టిన ‘చక్కా జామ్’ ఆందోళనలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగిన ఈ రహదారుల దిగ్భంధనం నిరసనల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమానికి మద్దతుగా విపక్షాలు, నిరసనకారులు రోడ్లపై బైఠాయించి చక్కా జామ్ నిర్వహించారు.
ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్‌ ఆందోళనలు జరిగాయి. ఈ మేరకు హారన్లు, గంటలు మోగించి రైతులు తమ నిరసనను తెలియజేశారు. రాజస్థాన్, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, పలు రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా రహదారులను దిగ్బంధించారు.

స్వల్ప ఉద్రిక్తత..
బెంగళూరు, పూణె, ఢిల్లీలోని పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంగళూరులోని యలహంక పోలీస్‌ స్టేషన్‌ బయట ఆందోళన చేస్తున్న రైతు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని షాహీదీ పార్క్‌ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు.

50వేల మందితో రాజధానిలో పహారా..
గణంతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాకాండ అనంతరం మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. చక్కా జామ్‌ దృష్ట్యా ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపుర్‌, టిక్రీ, సింఘు బోర్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించి డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. అంతేకాకుండా ముందస్తుగా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను బంద్ చేశారు.

మెట్రో సర్వీసుల పున:రుద్ధరణ..
చక్కా జామ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూడు గంటల అనంతరం ఢిల్లీ మెట్రో స్టేషన్లను కూడా తెరుస్తున్నట్లు డీఎంఆర్‌సీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలుంటాయని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read:

Farm Laws: కేంద్రానికి అక్టోబర్ 2 వరకు గడువిచ్చాం.. ఒత్తిడితో చర్చలు జరపలేం: రైతు సంఘం నేత తికాయత్

Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికే ప్రమాదకరం: రాహుల్ గాంధీ