Farmers Dies with Coronavirus: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది. మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు ఐదు నెలల నుంచి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు సరిహద్దు నుంచి కదిలేదేలేదని రైతులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఎముకలు కొరికే చలికాలంలో.. వర్షంలో ఆందోళనను కొనసాగించిన రైతులు కరోనా విజృంభిస్తున్నా తగ్గదేలేదంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సింగు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న ఇద్దరు రైతులు కరోనా బారినపడి మరణించారు. పాటియాలా, లుధియానాకు చెందిన ఇద్దరు రైతులు – బల్బీర్ సింగ్ (50), మహేందర్ సింగ్ (70) మంగళవారం మరణించారు. సింగు సరిహద్దు సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వారు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని సోనిపట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జస్వంత్ సింగ్ పునియా తెలిపారు.
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) స్పందించింది. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు భోపాల్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా బారినపడిన ఇద్దరు రైతులు మరణించినట్టు వెల్లడించారు. రైతులు ఇలా మరణిస్తూ పోతే ఉద్యమాన్ని ఎవరు చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యమాన్ని కొంతకాలం వాయిదా వేద్దామంటూ ఆయన రైతులను కోరారు. మనం మన పంటలతోపాటు.. ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటూ సూచించారు. బతికి ఉంటేనే భవిష్యత్తులో ఆందోళన చేయగలం అంటూ పేర్కొన్నారు.
Also Read: