Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దుపై హైడ్రామా కొనసాగింది. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ గవర్నర్ రమేష్ బైస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్‌లో పంపిందని వెల్లడించాయి రాజ్‌భవన్ వర్గాలు. దీనిపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే తనపై అనర్హత వేటుతో పాటు ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ పుకార్లు వస్తున్నవేళ, ఆయన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. శుక్రవారం పార్టీ MLAలతో, కూటమి ఎమ్మెల్యేలతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ భేటీకి 49 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు సీఎం హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని తిప్పికొట్టారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. అయినా.. సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని JMM నేతలు అభిప్రాయపడుతున్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందంటున్నారు. పైకి అంటున్నప్పటికీ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. హేమంత్ సోదరుడితో పాటు, కొందరు మంత్రులు, సీనియర్ JMM నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఇది జేఎంఎంలో వివాదాలకు దారితీసే ఛాన్సుందని అంటున్నారు. అయితే సోరెన్ ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.
81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ నేతృత్వంలోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)కి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలలో కాంగ్రెస్‌కు 18, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.
బిజెపికి 26 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కూటమి భాగస్వామి అయిన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు ఇద్దరు, మరో ఇద్దరు శాసనసభ్యుల మద్దతు ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 41.. కాగా.. అంతకంటే.. ఎక్కువ మంది మద్దతు ఉందని.. ఈసీ చేసిన సిఫార్సు గురించి గవర్నర్ ప్రకటించగానే.. ప్రతిపక్ష బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ మందితో రాజ్‌భవన్‌కు కవాతు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి