Arvind Kejriwal Coments : దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఫార్ములాను బహిర్గతం చేయాలన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అన్ని కంపెనీలకూ వ్యాక్సిన్ తయారుచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ జనాభా అందరికీ వ్యాక్సినేషన్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని సూచించారు. అప్పుడే కరోనా వైరస్ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. లేదంటే రోజు రోజుకు రూపం మార్చుకుంటున్న కరోనా వల్ల ఇంకా చాలా సమస్యలు ఏర్పడుతాయని హెచ్చరించారు.
అనంతంరం లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్ కారణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని తెలిపారు. అలాగే ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు. లాక్‌డౌన్ కాలాన్ని తాము వైద్య మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు వాడామని తెలిపారు. అలాగే, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచుకునేందుకు వినియోగించామని అన్నారు.
ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత తగ్గిందని చెప్పారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. యువకులు చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని వివరించారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డోసులు తక్కువగా అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మేము ఆశిస్తున్నామని చెప్పారు. మరోవైపు.. ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు సీరియస్‌గానే స్పందించిన విషయం తెలిసిందే. కేంద్రంపై న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆక్సిజన్ సరఫరా, పంపిణీకి 12 సభ్యులతో జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పడకలు, ఆక్సిజన్, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.