
మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ అనుమానస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ ఆమె అత్త గిరిబాలా సింగ్‌ను భోపాల్‌లో సీబీఐ అరెస్టు చేసింది. భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విష ఆత్మహత్య చేసుకుంది. గిరిబాలాసింగ్‌ను 8 గంటల పాటు ప్రశ్నించిన తరువాత సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ట్విషా శర్మకు పెళ్లై ఐదు నెలలే. మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ఆమె పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను వేధింపులకు గురవుతున్నానని వాటిల్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ట్విషా శర్మ మృతి కేసును.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారిస్తోంది. భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. ఇది వరకట్నం కోసం జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. దీంతో ట్విషా అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ కోర్టును ఆశ్రయించారు. భోపాల్ సెషన్స్ కోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భోపాల్ సెషన్స్ కోర్టు గిరిబాల సింగ్‌కు యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చింది.
సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్విషా ఫ్యామిలీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు యాంటిస్పేటరీ బెయిల్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ గిరిబాల సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం అరెస్ట్ చేసింది. వరకట్న వేధింపులు, గృహహింస, సాక్ష్యాధారాలను తారుమారు చేశారనే తీవ్రమైన ఆరోపణలతో ట్విషా భర్త సమర్థ్ సింగ్‌తో పాటు అత్త గిరిబాలా సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, దర్యాప్తును వేగవంతం చేసింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..