2024 నాటికి విద్యుత్ వాహనాలు(Electrical Vehicles), ఫ్లెక్స్ ఇంధన వాహనాల ధరలు పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్ల ధరలతో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.(Union Minister Nitin Gadkari) విద్యుత్ వాహనాల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను ఉపయోగించే సాధ్యాసాధ్యాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరీక్షించి ధృవీకరించిందని వెల్లడించారు. ప్రస్తుతం పెట్రోల్ ఆధారిత వాహనాల ధర కంటే ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి వివరించారు. టయోటా, హోండా, సుజుకి, బజాజ్, టీవీఎస్ వంటి వాటితో సహా.. ఇప్పటికే 100 శాతం ఇథనాల్ తో పనిచేసే ఫ్లెక్స్-ఇంధన నమూనాల పనిని ప్రారంభించినట్లు చెప్పారు. చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి పొందిన జీవ ఇంధనం, ఇథనాల్‌ను తయారు చేసే పని ఇప్పటికే జరుగుతోందని పేర్కొన్నారు.
“ఒక ఫ్లెక్స్ ఇంజిన్ 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. మొలాసిస్, బియ్యం, పంట వ్యర్థాలు, వంటివాటి నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఇథనాల్ ధర లీటరుకు రూ. 60 అయితే లీటర్ పెట్రోల్ ధర రూ.120 గా ఉంది. కెలోరిఫిక్ లీటరు పెట్రోలు విలువ 1.3 లీటర్ల ఇథనాల్‌తో సమానం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మూడు నెలల్లో దీనిని పరీక్షించి, ఈ సాంకేతికతను ధృవీకరించింది. ఇథనాల్ పెట్రోలు అంత ప్రభావవంతంగా ఉంటుంది. టీవీఎస్, బజాజ్, హీరో అన్నీ 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను సిద్ధం చేస్తున్నాయి.
– నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దేశంలో చాలా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలకు ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఉందని, విద్యుత్ వాహనాలు, ఫ్లెక్స్ ఇంధన వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ వాహనాల వినియోగం ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం, దేశంలో విక్రయిస్తున్న అన్ని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంది. 2022లో ఇప్పటివరకు దేశంలో 10,000 పైగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, దాదాపు 1.90 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయాలు జరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగానే పర్యావరణ హిత ఇంధనంగా ఇథనల్ ను ఉపయోగించేందుకు కృషి చేస్తున్నారు. పంటల వ్యర్థాల నుంచి తయారు చేసే పెట్రోల్ వంటి ఫ్యూయల్‌ను ఇథనాల్ అంటారు. ఒక లీటర్ ఇథనాల్.. ఒక లీటర్ పెట్రోల్‌తో సమానం. ఇలా తయారు చేసిన ఇథనాల్ ఇంధనంతో నడిచే కార్లను తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ఇథనాల్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
వాహన ధరల గురించి మంత్రి మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఇంజన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెట్రోల్‌తో నడిచే వాహనాల విధంగానే ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏడాది వ్యవధిలో పెట్రోల్ వాహనాల ధరల మాదిరిగానే ఫ్లెక్స్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం.. భారతదేశంలో FFVలు ఏవీ అమ్మకానికి లేవు. TVS అపాచీ మోటార్‌సైకిల్ ఇథనాల్-ఆధారిత వేరియంట్‌ను 2019లో ప్రారంభించింది. ఆ సమయంలో దీని ధర రూ.1.20 లక్షలు. అయినప్పటికీ, ఆ సమయంలో ఇంధనం లభ్యత తక్కువగా ఉండటం వల్ల అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి