ఆ 10 రాష్ట్రాల్లో ఎల్‌నినో ముప్పు.. ఖరీఫ్‌ సీజన్‌పై అప్రమత్తమైన కేంద్రం

దేశ వ్యవసాయంపై ఎల్‌నినో నీలినీడలు వ్యాపిస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రభావిత రాష్ట్రాలన్నింటిలోనూ తక్షణ జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఖరీఫ్ సన్నాహాలపై వారపు సమీక్షా సమావేశానికి నిర్వహించారు. ఇందులో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు..

ఆ 10 రాష్ట్రాల్లో ఎల్‌నినో ముప్పు.. ఖరీఫ్‌ సీజన్‌పై అప్రమత్తమైన కేంద్రం
El Nino Impact On Agriculture

Updated on: Jun 17, 2026 | 12:06 PM

హైదరాబాద్‌, జూన్‌ 17: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 9 నుంచి 10 రాష్ర్టాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, ఆయా రాష్ర్టాల్లోని జిల్లా అధికారులు, వ్యవసాయ సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల కోసం ముందస్తు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయటం, పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచటం, రైతులకు శాస్త్రీయ సలహాలు అందేలా చూడటంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.

రైతుల్లో భయాందోళనలు కలిగించొద్దు.. దారి చూపండి

రాష్ట్ర వ్యవసాయ శాఖలు, జిల్లా అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, విస్తరణ సంస్థలు సన్నిహితంగా సమన్వయం చేసుకుని, జిల్లా స్థాయిలో సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం కాదని, వారికి కచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత సలహాలు అందేలా చూడటమే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. రైతులకు భయపెట్టే సందేశాలు కాకుండా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వాలని, అలాగే ఆ సమాచార ప్రసారం శాస్త్రీయ విశ్లేషణపై ఆధారపడి ఉండాలని ఆయన అన్నారు. ప్రతి సున్నితమైన జిల్లాకు నీటి సంరక్షణ, నేల తేమ నిర్వహణ, అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటల సరళిపై దృష్టి సారించేలా ప్రత్యేక వ్యూహాలను రూపొందించాలని అన్నారు.

పత్తి, పప్పుధాన్యాల సాగుపై దృష్టి పెట్టండి

ఈ సమీక్షా సమావేశంలో ఖరీఫ్ సీజన్ కోసం పంటల వారీ లక్ష్యాలు, విత్తనాలు వేసే పురోగతి, రాష్ట్రాల వారీ సన్నద్ధతను కూడా అంచనా వేశారు. ఈ ఏడాది పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మెరుగైన విత్తన ఎంపిక, మల్చింగ్ పద్ధతులు, తేమ పరిరక్షణ చర్యల ద్వారా పత్తి ఉత్పాదకతను మెరుగుపరచాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది. పప్పుధాన్యాల దిగుమతులపై భారత్‌ ఆధారపడటాన్ని తగ్గించడానికి, మెరుగైన విత్తనాల లభ్యత, పంట మార్పిడి, సాంకేతిక మార్గదర్శకత్వం ద్వారా కంది, మినుములు, పెసర వంటి పంటల సాగును విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా జలాశయాల మట్టాలు, పంట ధరలు, ఎరువుల లభ్యతను సమీక్షించింది. దేశవ్యాప్తంగా తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి చౌహన్‌ తెలిపారు. రుతుపవనాల పురోగతి సమయంలో స్థానికంగా కొరత ఏర్పడే అవకాశం ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా ఎరువుల ముందస్తు సరఫరా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పరిశోధనలు ల్యాబ్‌లకే పరిమితం చేయొద్దు.. రైతులకు చేరాలి

వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖల మధ్య మరింత బలమైన సమన్వయం అవసరమని అన్నారు. వ్యవసాయ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సకాలంలో నేరుగా క్షేత్రస్థాయిలోని రైతులకు చేరాలని ఆయన అన్నారు. విజయవంతమైన, సురక్షితమైన ఖరీఫ్ సీజన్‌ను నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణ, క్రమమైన సమీక్ష, రైతుల నుండి స్థిరమైన అభిప్రాయ సేకరణ జరగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

FAQ’s

ఎన్ నినో అంటే ఏమిటి?

భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్‌ దేశాల సమీపంలో పసిఫిక్‌ మహా సముద్రజలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే, సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో భారత్‌ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్నే ఎల్‌నినో అంటారు. దీనివల్ల వర్షపాత చక్రం తలకిందులవుతుంది.

ఎన్ నినో ఎలా ఏర్పడుతుంది?

సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరుగడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా పెరిగితే అది ఎల్‌నినోకు దారితీస్తుంది. ఫలితంగా భారత్‌ సహా పశ్చిమాసియా దేశాల్లో అనావృష్టి తాండవిస్తుంది. 2026 ఏప్రిల్‌లో పసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల జలాలు అత్యధిక ఉష్ణోగ్రత స్థాయికి చేరాయి. ఇది గతంలోని బెంచ్‌ మార్క్‌ (0.5 డిగ్రీల సెల్సియస్‌) కన్నా 1.43 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువగా నమోదైనట్టు తెలిసింది. ఈ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ జూలై చివరినాటికి ఈ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని నేషనల్‌ ఎన్‌వోఏఏ చెబుతుంది. అంటే ఈ పరిణామం సూపర్‌ ఎల్‌నినోకు దారితీస్తుంది.

ఎన్నేళ్లకొకసారి ఎన్ నినో సంభవిస్తుంది?

ఎన్ నినో సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఇది ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో జరగదు. దీని ప్రభావాలు సాధారణంగా 9 నుండి 12 నెలల పాటు కొనసాగుతాయి, కానీ కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు కూడా ఉండవచ్చు.

ఎన్ నినోతో నిత్యవసర ధరలు ఎందుకు పెరుగుతాయి?

ఎల్‌నినో కారణంగా ప్రపంచ దేశాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది. భారత్‌ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. ఫలితంగా కరువు పరిస్థితులు వస్తాయి. తీరప్రాంత దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఎండలు మండిపోతాయి. పంటల సాగు తగ్గి నిత్యవసరాల ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. 1876-78 మధ్య పసిఫిక్‌ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటినప్పుడు దక్షణాదిలో కరువు విలయతాండవం చేసింది.

Follow Us