AIADMK legislative party leader: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన (ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగమ్) ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇక నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని పార్టీ నేతలు తెలిపారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో మూడు గంటల సమావేశం నిర్వహించిన అనంతరం పార్టీ నేతలు ఈ ప్రకటన చేశారు. ముందుగా ఎడప్పాడి పళనిస్వామి, లేదా ఓ పన్నీర్ సెల్వం ఎన్నికవుతారని వారిద్దరి మధ్యే పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. పార్టీ శాసనసభ్యులంతా ఈపీఎస్‌నే ఎన్నుకున్నాయి.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 159 స్థానాల్లో విజయం సాధించింది. గత పదేళ్లుగా తమమిళనాడులో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 72 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇన్నాళ్లు డీఎంకే పార్టీకి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత నాలుగున్నరేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎన్నికయ్యారు. కాగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ-ఎఐఏడీఎంకే పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. అయితే కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు కూటమిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాయి.
డీఎంకె నేతృత్వంలోని కూటమి 159 సీట్లను గెలుచుకోగా, ఎఐఎడిఎంకె నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. డీఎంకే 133 సీట్లు గెలవగా.. ఎఐఏడీఎంకె 66 సీట్లు సాధించింది.
Also Read: