దేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాధుడి ఆలయనికి అనుకోని కష్టాలు వచ్చాయి. ఈ ఆలయంలో ఎలుకలు నానా హంగామా సృష్టిస్తున్నాయి. భారీగా మూషిక సైన్యం ఆలయంలో తిష్ట వేసి.. దేవుళ్లకు చెందిన వస్తువులను, వస్త్రాలను పాడుచేస్తున్నాయి. తెల్లవారుజామున గర్భగుడిని తెరవగానే ఎలుకలు కొరికి వేసిన స్వామివార్ల వస్త్రాలు, పూలదండలు ముక్కలు ముక్కలుగా పడివుంటున్నాయి. దీంతో తాము పూజలను చేసేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆలయ పూజారులు వాపోతున్నారు. ఈ ఎలుకల బెడదను తక్షణమే అరికట్టాలని.. లేదంటే ఎలుకల బొరియలతో రాళ్ల మధ్య ఖాళీలు ఏర్పడుతున్నాయని.. ఇలా కొనసాగితే.. ఆలయ నిర్మాణానికే ముప్పు ఏర్పడుతుందని పూజారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జగన్నాథ్ దేవాలయానికి ఊహించని కష్టాలకు కారణమైన ఎలుకల ఈ స్థాయిలో పెరగడానికి స్పెషల్ రీజన్ చెబుతున్నారు ఆలయ పూజారులు..
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భక్తులు లేని సమయంలో ఎలుకల సంఖ్య అనేక రెట్లు పెరిగిందని.. ‘రత్న సింఘాసన్’ (పవిత్ర పీఠం) పై ఉన్న జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల అలంకరణ ను నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రతిరోజూ వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి పూజారుల పూజకు ఆటంకాలు కలిగిస్తున్నాయని తెలిపారు. దేవతల చెక్క విగ్రహాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
అయితే ఎలుకల వల్ల ‘గర్భ గుడిలో ఇబ్బంది ఉన్నప్పటికి.. ఆలయ సేవకులు జంతువులను చంపడానికి లేదా ఆలయం లోపల వాటికి విషం పెట్టడానికి అనుమతి లేదని జగన్నాథ్ సంస్కృతి పరిశోధకుడు భాస్కర్ మిశ్రా చెప్పారు. “ఆలయ ఆవరణలో కనిపించే ఎలుకలు, గబ్బిలాలు, కోతులతో ఎలా వ్యవహరించాలో ఆలయ హక్కుల రికార్డులు (ROR) పేర్కొన్నాయి. ఆలయ నిబంధనల ప్రకారం ఏ జీవి ప్రాణాన్ని తీయలేమని మిశ్రా చెప్పారు.
2020,2021 లాక్‌డౌన్ సమయంలో ఆలయం లోపల భక్తులు లేకపోవడం వల్ల ఎలుకల జనాభా పెరిగినప్పటికీ, ఎలుకలు ఈ ప్రదేశానికి కొత్త కాదని మిశ్రా చెప్పారు. కొన్ని జంతువులు జగన్నాథ ఆలయ ప్రాంగణంలో తరతరాలుగా నివసిస్తున్నాయని .. వాటికీ ఆలయంలో మిగిలిపోయిన ‘మహాప్రసాదం’ తగిన పరిమాణంలో లభిస్తుందని ఆయన చెప్పారు. “చిట్టెలుకలను సజీవంగా పట్టుకుని బయటికి వదిలే బాధ్యత కొంతమంది ప్రత్యేక సేవకులకు ఇవ్వబడిందని అని మిశ్రా చెప్పారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జితేంద్ర సాహూ మాట్లాడుతూ.. ఎలుకల బెడద గురించి శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి చేరుకుందని తెలిపారు. తాము ఎలుకలను సజీవంగా పట్టుకోవడానికి ఉచ్చులు వేస్తున్నామని .. సంవత్సరాలుగా అవలంబించిన నిబంధనల ప్రకారం వాటిని బయటికి వదులుతున్నామని తెలిపారు . చెక్క దేవతలకు ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొన్న సాహూ వాటిని గంధం , కర్పూరంతో క్రమం తప్పకుండా పాలిష్ చేస్తున్నామని చెప్పారు. పూరీలోని వన్యప్రాణి విభాగం జగన్నాథ ఆలయ ప్రాంగణంలో కోతులు, గబ్బిలాలు, పావురాలు, పాములు కూడా కనిపిస్తాయని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..