హర్యానాలో ‘లవ్ జిహాద్’ తెచ్చిన చిక్కు, బీజేపీ, జన నాయక్ జనతా పార్టీ మధ్య విభేదాలు
హర్యానాలో పాలక బీజేపీకి, దాని మిత్ర పక్షమైన జన నాయక్ జనతా పార్టీకి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడుల నిరోధానికి యూపీ....
హర్యానాలో పాలక బీజేపీకి, దాని మిత్ర పక్షమైన జన నాయక్ జనతా పార్టీకి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడుల నిరోధానికి యూపీ తరహాలో తాము కూడా చట్టం తేవాలని ఈ రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తుండగా.. ఇందుకు డిప్యూటీ సీఎం, జన నాయక్ జనతాపార్టీ నేత కూడా అయిన దుశ్యంత్ చౌతాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు లవ్ జిహాద్ అన్న పదజాలమే తప్పని ఆయన అంటున్నారు. దీనిని తను అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రేమ పేరిట ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లి చేసుకుని ఆ తరువాత వారిని బలవంతంగా ఇస్లాం లోకి మారుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు మొదట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది. కాగా-బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు చట్టం తెస్తే తమకు అభ్యంతరం లేదని, ఎవరైనా ఇష్ట పూర్వకంగా మరో మతంలోకి మారగోరితే ఇక సమస్య ఏముందని ఆయన అంటున్నారు. ఇది ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఇప్పటికే రైతుల నిరసనలపై దుశ్యంత్ చౌతాలా వారికి మద్దతుగా మాట్లాడుతుండడం, మరోవైపు రైతు చట్టాలను సమర్థిస్తున్న ఈ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి మధ్య మెల్లగా ‘మైత్రి’ బీటలు వారుతున్న నేపథ్యంలో లవ్ జిహాద్ అంశం వీరి మధ్య మరో వివాదాన్ని రాజేసింది. అన్నదాతల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో అవసరమైతే తను రాజీనామా కూడా చేస్తానని ఆయన హెచ్చ రించారు. చౌతాలా నిన్న చండీ గడ్ లో తమ సామాజికవర్గానికి చెందివారితో భేటీ అయ్యారు. లవ్ జిహాద్ కు సంబంధించి ఓ చట్టాన్ని హర్యానా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి జరుగుతున్న యత్నాలపై తాము చర్చించామని చౌతాలా సన్నిహిత నేత ఒకరు తెలిపారు. కాగా- మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ విధమైన చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :