AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..

కేంద్ర మంత్రివర్గంలోకి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్తున్నారా? మహారాష్ట్ర సీఎం కుర్చీ మారబోతుందా? గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి ముంబై వరకు సాగుతున్న ఈ ఊహాగానాలకు స్వయంగా ఫడ్నవీస్ పుల్‌స్టాప్ పెట్టారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఢిల్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..
Is Devendra Fadnavis Joining Union Cabinet
Krishna S
|

Updated on: Aug 18, 2026 | 1:16 PM

Share

కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారంతో పాటు తాను కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. తాను మహారాష్ట్రలోనే ఉంటానని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడమే తన కర్తవ్యమని స్పష్టం చేస్తూ ఆ ఊహాగానాలకు తెరదించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ప్రధానితో చర్చించారు. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తోనూ భేటీ అయి రాష్ట్ర ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సమీక్షించారు. ఈ భేటీల అనంతరం కేంద్ర కేబినెట్ మార్పులు, తన పాత్రపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు

తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మొదలవుతుంటాయి.. పనీపాటా లేని కొందరు ఇలాంటి ఆధారాల్లేని వదంతులను సృష్టిస్తున్నారని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ‘‘కొందరు గాలిపటాలు ఎగరేస్తూ, గాల్లో మేడలు కడుతూ సంతోషపడుతుంటే వారిని అలాగే ఉండనివ్వండి. అధిష్టానం నాకు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. నేను అక్కడే ఉంటాను.. అక్కడి ప్రజలకే నిజాయతీగా సేవ చేస్తాను. నన్ను ఢిల్లీకి పంపాలని కొందరు ఆశపడుతున్నా.. నేను మాత్రం మహారాష్ట్రను విడిచి వెళ్లను’ ’అని తేల్చిచెప్పారు.

సంజయ్ రౌత్ ఆరోపణల నేపథ్యం

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మోదీ తన కేబినెట్‌లో యువ ముఖాలకు చోటు కల్పించే క్రమంలో ఫడ్నవీస్‌ను ఢిల్లీకి పిలిపించి కేంద్ర మంత్రిని చేస్తారని, మహారాష్ట్ర సీఎం పీఠాన్ని చంద్రశేఖర్ బవాన్కులేకు అప్పగిస్తారని రౌత్ ఆరోపించారు. దీనికితోడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పదనే చర్చలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికీ ఫడ్నవీస్ తన వ్యాఖ్యలతో తెరదించుతూ, తన దృష్టి పూర్తిగా మహారాష్ట్ర పరిపాలన, అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు.

Follow Us