
పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణ భారతదేశంలో నిర్వహించాలన్న డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తోంది. పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతాయి. ఇందులో జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో రెండు విడతలుగా సాగుతాయి. జులై-ఆగస్ట్ నెలల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నవంబర్ – డిసెంబర్ మాసాల్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడు సెషన్లలో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారులో కొందరు రెండు సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటు చలి, అటు వేసవి రెండూ కూడా భరించలేని స్థాయిలోనే ఉంటాయి. వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో అత్యధిక ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటే, శీతాకాల సమావేశాల్లో తీవ్రమైన చలితో పాటు ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ రెండు సెషన్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రతిపాదించారు. ఇప్పటికే ఆయన ట్విట్టర్ (X) ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు చేసిన ఆయన.. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత పెంపొందుతుందని వ్యాఖ్యానించారు.
Idea of holding 2 parliament sessions in Southern Part of India is gaining huge momentum from the MPs
and Governments of Southern states. The core thought behind this is to help strengthening the National Integration. It can also
favor the law makers and Parliament Officials to… pic.twitter.com/CWvtH027JF— Maddila Gurumoorthy (@GuruMYSRCP) November 26, 2024
గురుమూర్తి పోస్టులో భారత రాజ్యాంగ రూపశిల్పి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన “Thoughts of Linquistic States” (భాష ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు) పుస్తకంలో ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం పార్లమెంట్ సమావేశాల నిర్వహణ విషయంలో ఉదారంగా ఉండాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. 1968లో స్వతంత్ర ఎంపీగా ఉన్న ప్రకాశ్ వీర్ శాస్త్రి ఏకంగా ఈ విషయంపై ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని ఆయన లోక్‌సభలో లేవనెత్తేందుకు ఎంపీ గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు. జీరో అవర్‌లో చర్చ కోరుతూ ఆయన నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. గురుమూర్తి ప్రయత్నాన్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ (భువనగిరి) చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. తమ పార్టీ అధిష్టానంతో చర్చించి ఈ విషయంపై తాను కూడా తన వంతు సమర్థించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ప్రాంతీయ అసమానతలు, సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలను రాజధానితో పాటు మరో నగరంలో కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రానికి దక్షిణ భాగాన ఒక మూలకు ఉంటుంది. ఉత్తర కర్ణాటక వాసుల సెంటిమెంటుతో పాటు మరికొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాన ఉన్న బెళగావిలో కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఒక సెషన్ నిర్వహిస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం రాష్ట్రానికి పశ్చిమ దిక్కున అరేబియా సముద్రతీరంలో ఉంటుంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇది దూరంగా ఉంటుంది. అందుకే రాష్ట్రానికి తూర్పున విదర్భ ప్రాంతంలో ఉన్న నాగ్‌పూర్ నగరంలో ఒక సెషన్ నిర్వహిస్తోంది. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం రాజధానితో పాటు మరో నగరంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిమాచల్ రాజధాని సిమ్లాతో పాటు ధర్మశాలలో అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాజధానిగా ఉన్న డెహ్రాడూన్‌తో పాటు గైర్‌సైనీలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం భవనాలను నిర్మించారు. జమ్ము-కాశ్మీర్‌కు అధికారికంగానే శ్రీనగర్, జమ్ము నగరాలు రాజధానిగా కొనసాగుతూ రెండు నగరాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ఒకట్రెండు సెషన్లను నిర్వహించాలన్న డిమాండ్ సహేతుకంగా కనిపిస్తోంది.
త్వరలో దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయనుంది. ఇప్పటి వరకు 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 134. అంటే మొత్తం సంఖ్యలో 24.6% వాటా దక్షిణాది రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, పుదుచ్ఛేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పరిధిలో ఉన్నాయి. అంటే ప్రతి నలుగురు ఎంపీల్లో ఒకరు దక్షిణ భారతదేశానికి చెందినవారని ఈ లెక్క చెబుతోంది. 1971 నాటి జనాభా లెక్కలను అనుసరించి ఏ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉండాలన్నది నిర్ణయించారు. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణ పథకాన్ని దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తే, ఉత్తరాది రాష్ట్రాలు నేటికీ ఏ కోశానా అమలు చేయడం లేదు. దీంతో జనాభా పెరుగుదలలో ఉత్తర – దక్షిణ ప్రాంతాల మధ్య తేడా చాలా పెరిగింది. పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకుండా ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను తాజా జనాభా గణాంకాల ప్రకారం విభజిస్తే దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం 134 నుంచి 108కి పడిపోతుంది. ప్రాతినిధ్యం శాతం చూస్తే 20% కి తగ్గుతుంది. అంటే ప్రతి ఐదుగురు ఎంపీల్లో ఒకరు మాత్రమే దక్షిణాదికి చెందినవారు ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడున్న 42 సీట్లలో 8 సీట్లకు కోత పడి 34కే పరిమితం కావాల్సి ఉంటుంది. 39 సీట్లున్న తమిళనాడులో కూడా 8 సీట్లు కోతపడి 31కి పరిమితం కావాల్సి ఉంటుంది. కేవలం 20 సీట్లే ఉన్న కేరళలో కూడా 8 సీట్ల కోత పడి 12కే పరిమితం కావాల్సి ఉంటుంది. కర్ణాటకలో జనాభా పెరుగుదల మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే కాస్త మెరుగ్గా ఉంది కాబట్టి 28 సీట్లున్న ఆ రాష్ట్రంలో 2 సీట్లు మాత్రమే కోతపడుతున్నాయి.
జనాభా నియంత్రణతో అభివృద్ధి సాధించి అత్యధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తూ.. ఐటీ వంటి రంగం ద్వారా అత్యధిక ఆదాయాన్ని గడించిపెడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోతుంది. ఈ అన్యాయంపై దక్షిణాది రాజకీయ పార్టీలు ఇప్పటికే గళమెత్తి నినదిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు పిల్లల సంఖ్యను ఇద్దరికే పరిమితం చేయకుండా పెంచాలంటూ ప్రోత్సహించడం వెనుక కారణం కూడా ఇదేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది ఎంపీల నుంచి మొదలైన పార్లమెంట్ సమావేశాల డిమాండ్ చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ ఆ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే.. అందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడతాయి. వీటిలో హైదరాబాద్ మహానగరం అనధికారికంగా దేశ 2వ రాజధానిగా ఉంది. భారత రాష్ట్రపతికి రాష్ట్రపతి భవన్ వెలుపల ఎక్కడైనా అధికారిక నివాసం ఉందంటే అది హైదరాబాద్‌లోనే (రాష్ట్రపతి నిలయం) ఉంది. అనేక రక్షణ రంగ సంస్థలు, పెద్దైన కంటోన్మెంట్ వ్యవస్థ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సానుకూల అంశాలు. వర్షాకాల, శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు హైదరాబాద్ నగర వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..